
దాదా-షా భవితవ్యం ఆగస్టు 17కు వాయిదా!
ఇంటర్నెట్ డెస్క్: బీసీసీఐ రాజ్యాంగ సవరణ, అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం పొడగింపు సహా మరికొన్ని అంశాలపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 17న తిరిగి విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు సౌరవ్ గంగూలీ, జై షా తమ పదవుల్లో కొనసాగుతారని సమాచారం.
బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం ఆరేళ్లు పదవుల్లో ఉన్న పాలకులు మూడేళ్లు విరామం (కూలింగ్ ఆఫ్) తీసుకోవాలి. బోర్డు నూతన కార్యవర్గం ఏర్పడి పది నెలలు మాత్రమే అవుతోంది. అంతకు ముందు గంగూలీ, షా తమ రాష్ట్ర బోర్డుల్లో పదవీ బాధ్యతల్లో ఉన్నారు. దాంతో కలిపి ఆరేళ్ల గడువు పూర్తవుతోంది. మేలో షా పదవీ కాలం ముగిసింది. జులై 27న దాదా గడువు ముగుస్తుంది. గత డిసెంబర్‌లో జరిగిన 88వ సర్వసభ్య సమావేశంలో రాజ్యాంగంలో మార్పులు చేస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం నిబంధనలు సవరించారు. దానిని సుప్రీం కోర్టు ఆమోదం కోసం పంపించారు.
ప్రస్తుతం దాదా, షా బోర్డు సమావేశాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. సుప్రీం విచారణ వాయిదా పడటంతో పది రోజుల్లో జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలోనూ వీరు పాల్గొంటారని తెలుస్తోంది.