పంజాబ్‌ విజయాలకు వాళ్లిద్దరే కారణం: సన్నీ

టీ20 క్రికెట్‌ లీగ్‌లో పంజాబ్‌ జట్టు జోరు కొనసాగిస్తోంది. టోర్నమెంట్‌ ఆరంభంలో వరుస ఓటములతో డీలాపడ్డ ఆ జట్టు అద్భుతంగా పుంజుకొని విజయాల బాటపట్టింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో........

Published : 27 Oct 2020 01:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 క్రికెట్‌ లీగ్‌లో పంజాబ్‌ జట్టు జోరు కొనసాగిస్తోంది. టోర్నమెంట్‌ ఆరంభంలో వరుస ఓటములతో డీలాపడ్డ ఆ జట్టు అద్భుతంగా పుంజుకొని విజయాల బాటపట్టింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌తో పాటు కోచ్‌ కుంబ్లేపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. దాదాపు అసాధ్యమైన ప్లేఆఫ్స్‌ అవకాశాలను సుసాధ్యం చేసే దిశగా పంజాబ్‌ దూసుకెళుతోందంటే వాళ్లిద్దరే కారణమని అభిప్రాయపడ్డాడు.

‘టోర్నమెంట్‌ ఆరంభంలో పంజాబ్‌ వరుస మ్యాచుల్లో ఓడింది. కానీ ఇప్పుడు ఆ జట్టు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాహుల్‌ సేన ఓడిన మ్యాచులన్నీ దాదాపు గెలుపు అంచుల వరకూ వచ్చి ఓడినవే. పంజాబ్‌ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లోనే సూపర్‌ ఓవర్‌ వరకూ వచ్చి ఓడిపోయింది. తర్వాత ఎదురైన సూపర్‌ఓవర్‌ మ్యాచ్‌ను మాత్రం గెలిచింది. ఇక్కడ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ కెప్టెన్సీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఫీల్డింగ్‌ మోహరింపులో రాహుల్‌ మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. అతను మంచి కెప్టెన్‌గా ఎదుగుతున్నాడు. గత మ్యాచ్‌లో 126 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు  కాపాడుకున్న తీరు అద్భుతం. కెప్టెన్‌ రాహుల్‌ తీసుకున్న మంచి నిర్ణయాల వల్లే ఆ మ్యాచ్‌లో విజయం సాధ్యమైందని చెప్పాలి. ప్రత్యర్థి విజయానికి ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు అవసరం ఉన్న సమయంలో యువ బౌలర్‌ అర్షదీప్‌సింగ్‌కు బౌలింగ్‌ ఇవ్వడం చూస్తుంటే తనలోని తెగింపు కనిపిస్తోంది’ అని గావస్కర్‌ అన్నాడు.

జట్టు కోచ్‌ అనిల్‌ కుంబ్లేపై కూడా సన్నీ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘కుంబ్లే ఓ పోరాట యోధుడు. తీవ్ర గాయమైనా కట్టుకట్టుకొని మైదానంలో బౌలింగ్‌ చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇద్దరు పోరాట యోధులు కెప్టెన్‌ రాహుల్‌, కుంబ్లే సమర్థంగా పనిచేస్తుండటం వల్లే ఆ జట్టు వరుస ఓటముల నుంచి గెలుపు బాట పట్టింది’ అని గావస్కర్‌ అన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని