T20 World Cup: ఆశలు ఆవిరి

ఆశలకు తెర. టీ20 ప్రపంచకప్‌ నుంచి టీమ్‌ ఇండియా ఔట్‌. అభిమానులంతా కోరుకున్నట్లు అద్భుతమేమీ జరగలేదు. అఫ్గానేమీ సంచలనం సృష్టించలేదు. న్యూజిలాండ్‌ చేతిలో ఆ జట్టు పరాజయంపాలైన వేళ..కోహ్లీసేన

Updated : 08 Nov 2021 04:24 IST

టీ20 ప్రపంచకప్‌ నుంచి భారత్‌ ఔట్‌

అఫ్గాన్‌ను ఓడించి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌

అబుదాబి

ఆశలకు తెర. టీ20 ప్రపంచకప్‌ నుంచి టీమ్‌ ఇండియా ఔట్‌. అభిమానులంతా కోరుకున్నట్లు అద్భుతమేమీ జరగలేదు. అఫ్గానేమీ సంచలనం సృష్టించలేదు. న్యూజిలాండ్‌ చేతిలో ఆ జట్టు పరాజయంపాలైన వేళ..
కోహ్లీసేన సెమీఫైనల్‌ దారి పూర్తిగా మూసుకుపోయింది. ఇవాళ నమీబియాతో ఆ జట్టు సూపర్‌ 12 మ్యాచ్‌ నామమాత్రమే. గ్రూప్‌-2 నుంచి పాకిస్థాన్‌ తర్వాత రెండో జట్టుగా కివీస్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

ప్రపంచకప్‌లో భారత జట్టు కథ ముగిసింది. ఆదివారం జరిగిన సూపర్‌ 12 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించి 8 పాయింట్లతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మొదట అఫ్గానిస్థాన్‌ 8  వికెట్లకు 124 పరుగులే చేయగలిగింది. నజిబుల్లా జద్రాన్‌ (73; 48 బంతుల్లో 6×4, 3×6) ఒక్కడే రాణించాడు. బౌల్ట్‌ (3/17), సౌథీ (2/24), మిల్నె   (1/17), నీషమ్‌  (1/24) అఫ్గాన్‌కు కళ్లెం వేశారు. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (40 నాటౌట్‌; 42 బంతుల్లో 3×4), కాన్వే (36 నాటౌట్‌; 32 బంతుల్లో 4×4) రాణించడంతో లక్ష్యాన్ని కివీస్‌ 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బౌల్ట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు సెమీఫైనల్‌కు చేరే అవకాశముండగా.. ఆడిన అయిదు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన పాకిస్థాన్‌ 10 పాయింట్లతో, నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గిన న్యూజిలాండ్‌ ఎనిమిది పాయింట్లతో ముందంజ వేశాయి. ఒకవేళ న్యూజిలాండ్‌పై అఫ్గాన్‌ గెలిచి ఉంటే భారత్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండేవి. కానీ అఫ్గానిస్థాన్‌ ఓటమితో నమీబియాతో మ్యాచ్‌ నామమాత్రమైంది.

నజిబుల్లా ఒక్కడే..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గానిస్థాన్‌.. న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి తడబడింది. నజిబుల్లా జద్రాన్‌ ఒక్కడే రాణించాడు. అతడొక్కడు పోరాడకుంటే అఫ్గాన్‌ ఆ మాత్రం స్కోరైనా చేసేది కాదు. ఆ జట్టు ఆరంభం పేలవం. 5.1 ఓవర్లలో 19 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. షెజాద్‌ను బౌల్ట్‌, జజాయ్‌ని మిల్నె, గుర్బాజ్‌ను సౌథీ వెనక్కి పంపారు. ఆ దశలో నజిబుల్లా జట్టును ఆదుకున్నాడు. నైబ్‌ (15)తో కలిసి నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించాడు. పదో ఓవర్లో నైబ్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 56 పరుగులే. ఆ తర్వాత నబి (14)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు నజిబుల్లా. నబి సింగిల్స్‌కే పరిమితం కాగా.. నజిబుల్లా క్రమంగా వేగంగా పెంచాడు. చక్కని షాట్లతో ఫోర్లు, సిక్స్‌లు కొట్టాడు. 18వ ఓవర్లో నబిని సోధి ఔట్‌ చేయడంతో 59 పరుగుల అయిదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికి స్కోరు 115. చివరి రెండు ఓవర్లలో నజిబుల్లా వికెట్‌ సహా మూడు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్‌.. 9 పరుగులే చేయగలిగింది. ఛేదనలో కివీస్‌.. చెలరేగకపోయినా సాఫీగా లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్లు గప్తిల్‌ (28), మిచెల్‌ (17) మూడు ఓవర్లలో 26 పరుగులు జోడించారు. నాలుగో ఓవర్లో మిచెల్‌ను ముజీబ్‌ ఔట్‌ చేశాడు. 9వ ఓవర్లో గప్తిల్‌ను రషీద్‌ ఖాన్‌ వెనక్కి పంపాడు. అప్పటికి స్కోరు 57. అయితే విలియమ్సన్‌, కాన్వే ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. రషీద్‌, ముజీబ్‌, నబిల స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న ఈ జంట.. అభేద్యమైన మూడో వికెట్‌కు 68 పరుగులు జోడించింది.

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: జజాయ్‌ (సి) శాంట్నర్‌ (బి) బౌల్ట్‌ 2; షెజాద్‌ (సి) కాన్వే (బి) మిల్నె 4; గుర్బాజ్‌ ఎల్బీ (బి) సౌథీ 6; నైబ్‌ (బి) సోధి 15; నజిబుల్లా (సి) నీషమ్‌ (బి) బౌల్ట్‌ 73; నబి (సి) అండ్‌ (బి) సౌథీ 14; జనత్‌ (సి) సోధి (బి) బౌల్ట్‌ 2; రషీద్‌ (సి) విలియమ్సన్‌ (బి) నీషమ్‌ 3; ముజీబ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 8  వికెట్లకు) 124; వికెట్ల పతనం: 1-8, 2-12,  3-19, 4-56, 5-115, 6-119, 7-121, 8-124;  బౌలింగ్‌: సౌథీ 4-0-24-2; బౌల్ట్‌ 4-0-17-3; మిల్నె 4-0-17-1; నీషమ్‌ 4-0-24-1; శాంట్నర్‌ 2-0-27-0; సోధి 2-0-13-1

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్తిల్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 28; మిచెల్‌ (సి) షెజాద్‌ (బి) ముజీబ్‌ 17; విలియమ్సన్‌ నాటౌట్‌ 40; కాన్వే నాటౌట్‌ 36; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 125; వికెట్లపతనం: 1-26, 2-57; బౌలింగ్‌: నబి 4-0-26-0; ముజీబ్‌ 4-0-31-1; నవీనుల్‌ 2-0-16-0; హమీద్‌ హసన్‌ 3-0-14-0; రషీద్‌ ఖాన్‌ 4-0-27-1; నైబ్‌ 1.1-0-9-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని