T20 World Cup: కివీస్‌తో మ్యాచ్‌ పాయే.. సెమీస్‌ ఆశలు గల్లంతాయే!

టీ20 ప్రపంచకప్‌లో రెండో ఓటమి. సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం.. ఇదీ టీమ్‌ ఇండియా పరిస్థితి.

Published : 01 Nov 2021 01:17 IST

దుబాయ్‌: భారత్‌కు మరో ఘోర పరాజయం. టీ20 ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా దిగిన భారత్‌కు భంగపాటు. న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చేతులేత్తేసింది. ఈ ఓటమితో భారత్‌ సెమీస్‌ అవకాశాలు దాదాపు గల్లంతయినట్లే. ఏదైనా సంచలనం జరిగితే కానీ సెమీస్‌ చేరుకోవడం కష్టమే. ఇప్పటికే దాయాది జట్టు పాక్‌తో ఓడి తీవ్ర విమర్శలపాలైన భారత్‌.. కీలక పోరులో న్యూజిలాండ్‌కు దాసోహమైంది.  

టీ20 ప్రపంచకప్‌ సూపర్-12లో భాగంగా భారత్‌పై న్యూజిలాండ్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. భారత జట్టులో ఒక్కరూ కూడా 30 పరుగులు మించి చేయలేదు. రవీంద్ర జడేజా(26) టాప్‌ స్కోరర్‌. 2.5 ఓవర్లలో భారత్‌ 11 పరుగులకే ఇషాన్‌ కిషన్‌(4) రూపంలో తొలివికెట్‌ కోల్పోయింది. 50 పరుగుల లోపే రాహుల్‌(18), రోహిత్‌(14), కోహ్లీ(9) కీలక వికెట్లను చేజార్చుకుంది. దీనికి తోడు భారత ఇన్నింగ్స్‌ మందకొడిగా సాగడంతో ఇక ఏ మాత్రం కోలుకోలేకపోయింది. 10 ఓవర్లకు భారత్‌ 48 పరుగులే చేసింది. హర్దిక్‌ పాండ్య(23)తో కలిసి జట్టు కట్టిన పంత్‌(12) మరోవికెట్‌ పడకుండా కొంత సేపు పోరాడారు. అయితే 70 పరుగుల వద్ద పంత్‌ ఔటయ్యాడు. ఇక చివరలో జడేజా రాణించడంతో భారత్‌ ఆమాత్రమైనా స్కోర్‌ చేసింది. 

అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌ చేపట్టిన కివీస్‌ 111 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది. న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మిచెల్‌ (49) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు మార్టిన్‌ గప్తిల్ (20), కేన్‌ విలియమ్సన్ (33*) రాణించడంతో భారత్‌పై సునాయాస విజయాన్ని నమోదు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు