Cricket News: WTC సమరానికి ముందు

కఠిన క్వారంటైన్‌లోనూ టీమ్‌ఇండియా క్రికెటర్లు హుషారుగా కనిపిస్తున్నారు.

Updated : 29 Feb 2024 19:08 IST

కఠిన క్వారంటైన్‌లోనూ టీమ్‌ఇండియా క్రికెటర్లు హుషారుగా కనిపిస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు వెంట ఉండటమే కారణం! క్వారంటైన్‌లో తమ పిల్లలతో ఉన్న చిత్రాలను రవిచంద్రన్‌ అశ్విన్, అజింక్య రహానె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మరోవైపు కెప్టెన్‌ కోహ్లి సవాల్‌కు సిద్ధంగా ఉన్నాడని చెబుతూ మైదానంలో విజయ సంకేతం చూపిస్తున్న అతడి ఫొటోను ఐపీఎల్‌లో తను సారథ్యం వహించే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోస్టు చేసింది.

నాయకుడిగా నేను ఉండలేను 


 

అబుదాబి: అఫ్గానిస్థాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ టీ20 జట్టుకు సారథ్యం వహించే అవకాశాన్ని వదులుకున్నాడు. కెప్టెన్సీ భారం తన ఆటపై ప్రభావం చూపుతుందని అన్నాడు. గత మూడేళ్లుగా తరుచుగా వివిధ ఫార్మాట్లలో జట్టు సారథుల్ని మారుస్తున్న అఫ్గానిస్థాన్‌ ప్రస్తుతం టీ20 కెప్టెన్‌ కోసం అన్వేషిస్తోంది. గతంలో అన్ని ఫార్మాట్లలోనూ జట్టుకు నాయకత్వం వహించిన రషీద్‌.. ఇప్పుడు కెప్టెన్సీ తీసుకునేందుకు సిద్ధంగా లేడు. ప్రస్తుతం ఆ జట్టుకు టెస్టు, వన్డేలకు హస్మతుల్లా షాహిది కెప్టెన్‌గా ఉన్నాడు. ‘‘నేను కెప్టెన్‌గా కంటే ఆటగాడిగా ఉత్తమ ప్రదర్శన చేయగలనని గట్టిగా నమ్ముతున్నా. వైస్‌ కెప్టెన్‌గా ఉంటూ అవసరమైనప్పుడు సారథికి సహాయ పడేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటా. కెప్టెన్‌గా ఉంటూ వివిధ విషయాలు ఆలోచించడం కంటే.. ఆటగాడిగా మెరుగైన ప్రదర్శన చేయడమే కీలకం. ప్రపంచకప్‌ సమీపిస్తోంది. ఈ పరిస్థితుల్లో సారథ్యం శక్తికి మించిన భారమే. ఆటగాడిగానే నేను సంతోషంగా ఉంటా. గతంలో కెప్టెన్‌గా చేసిన అనుభవముంది. నా ఆలోచన ధోరణి ఏంటో క్రికెట్‌ బోర్డుకు బాగా తెలుసు. అందుకే టీ20 కెప్టెన్సీ స్థానం ఖాళీగా ఉంచారు. ఆ స్థానంలో మరొకరి కోసం వెతుకుతున్నారు’’ అని రషీద్‌ వివరించాడు. 

జడ్డూని కాపీ కొట్టండి

లండన్‌: టెస్టు క్రికెట్లో సుదీర్ఘ కెరీర్‌ కావాలనుకుంటే ఇంగ్లాండ్‌ యువ ఆటగాళ్లు భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను కాపీ కొట్టాలని ఆ జట్టు మాజీ స్టార్‌ కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. ‘‘ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ జట్టులో బ్యాటింగ్‌ చేయగల సమర్థుడైన లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ లేకపోవడం అసహనాన్ని కలిగిస్తోంది. భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఎలా రాణించాడో చూడండి. ఇలాంటి ఆటగాడు ఇంగ్లాండ్‌కూ కావాలి. అన్ని ఫార్మాట్లలో సత్తా చాటగల స్పిన్‌ ఆల్‌రౌండర్‌ జట్టుకు ఎంతో అవసరం. ఇందుకోసం ఎంతైనా వెచ్చించాలి. మీరు ఇప్పుడే క్రికెట్లోకి వస్తే లేదా కౌంటీల్లో ఆడుతుంటే జడేజాను కాపీ చేయండి. ఎందుకంటే అతడో సూపర్‌స్టార్‌. జడ్డూలా ఆడగలిగితే టెస్టు క్రికెట్లో సుదీర్ఘ కెరీర్‌ ఉంటుంది’’ అని కేపీ చెప్పాడు. బ్యాటింగ్‌ నైపుణ్యం ఉన్న లీచ్, బెస్‌ జట్టులో ఉన్నారని, అయితే వీళ్లిద్దరూ టెస్టు స్థాయి స్పిన్నర్లు కాదని కేపీ అభిప్రాయపడ్డాడు. ‘‘లీచ్, బెస్‌ టెస్టు స్పిన్నర్లు కాదు. పనేసర్, స్వాన్‌ మాదిరిగా లీచ్‌ ప్రభావం చూపలేకపోతున్నాడు’’ అని పీటర్సన్‌ అన్నాడు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని