
IND vs ENG: తొలి సెషన్ పూర్తి.. భారత్ విజయానికి ఇంకా 8 వికెట్లు
ఇంటర్నెట్ డెస్కు: నాలుగో టెస్టులో విజయం సాధించడానికి భారత్ ఇంకా 8 వికెట్ల దూరంలో నిలిచింది. ఐదోరోజు తొలి సెషన్లో ఇంగ్లాండ్ 27 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 54 పరుగులు సాధించి రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 77/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో సోమవారం ఆట కొనసాగించిన ఆ జట్టు కాస్త నెమ్మదిగా ఆడుతోంది. ఈ క్రమంలోనే భోజన విరామ సమయానికి 59 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఓపెనర్ రోరీ బర్న్స్ (50) అర్ధశతకం సాధించాక శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు హమీద్ (62*)తో కలిసి అతడు తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం నిర్మించాడు. మరోవైపు హమీద్ 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జడేజా వేసిన 48వ ఓవర్లో షాట్ ఆడబోయిన అతడు మిడాన్‌లో సిరాజ్ చేతికి చిక్కినట్లే అనిపించినా తృటిలో బతికిపోయాడు. ఇక వన్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలన్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అతడు అనుకోని విధంగా రనౌటయ్యాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 120/2గా నమోదైంది. ఆపై కెప్టెన్ జో రూట్ (8*), హమీద్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. మిగతా రెండు సెషన్లలో ఇంగ్లాండ్ విజయానికి 237 పరుగులు అవసరం కాగా, భారత విజయానికి 8 వికెట్లు తీయాల్సిఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.