Updated : 29 Sep 2021 07:03 IST

IPL 2021: ముంబయి.. ఎట్టకేలకు

హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత గెలుపు బాట

మెరిసిన బుమ్రా, పొలార్డ్‌, సౌరభ్‌

అయిదో విజయంతో ప్లేఆఫ్‌ రేసులో ముందంజ

ఐపీఎల్‌లో తిరుగులేని అందరినీ భయపెట్టే జట్టు చాలా బేలగా కనిపిస్తుంటే అందరిలోనూ ఆశ్చర్యం! వరుసగా మూడు ఓటములతో ప్లేఆఫ్‌ రేసులో వెనుకబడిపోవడంతో ఈసారికి రోహిత్‌ సేన పనైపోయినట్లే అన్న అభిప్రాయం! మంగళవారం పంజాబ్‌తో పోరులోనూ ఆ జట్టుకు కష్టాలు తప్పలేదు. ముందున్నది స్వల్ప లక్ష్యమే స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ ఒక్కొక్కరుగా పెవిలియన్‌ చేరిపోతుంటే.. ముంబయి ఖాతాలో మరో ఓటమి జమ అయినట్లే అనిపించింది. కానీ సౌరభ్‌ తివారి, హార్దిక్‌ పాండ్య అనూహ్యంగా చెలరేగి ఆడి జట్టును గెలిపించారు. అయిదో విజయంతో ముంబయి ప్లేఆఫ్‌ రేసులోకి కాస్త ముందంజ వేయగా.. ఏడో పరాజయంతో పంజాబ్‌ తన అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది.


అబుదాబి

10 మ్యాచ్‌లు.. 4 విజయాలు.. 6 ఓటములు.. ఐపీఎల్‌-14లో ప్లేఆఫ్‌ బెర్తును ఆశిస్తున్న పంజాబ్‌, ముంబయి జట్ల పరిస్థితిది. వీటి మధ్య పోరులో ముంబయి పైచేయి సాధించింది. ఆ జట్టు మంగళవారం 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బుమ్రా (2/24), పొలార్డ్‌ (2/8), రాహుల్‌ చాహర్‌ (1/27)ల ధాటికి పంజాబ్‌ 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ (42; 29 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్‌. అనంతరం ముంబయి 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సౌరభ్‌ తివారి (45; 37 బంతుల్లో 3×4, 2×6), హార్దిక్‌ పాండ్య (40 నాటౌట్‌; 30 బంతుల్లో 3×4, 2×6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పొలార్డ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ లభించింది.

పంజాబ్‌ చేజేతులా..: బ్యాటింగ్‌ వైఫల్యంతో వరుసగా ఓడుతున్న ముంబయి.. ఈ మ్యాచ్‌లోనూ తడబడింది. 15 ఓవర్ల వరకు ఆ జట్టు ఆట చూస్తే మరో ఓటమి తప్పదనే అనిపించింది. కానీ పంజాబ్‌ చివర్లో పట్టు కోల్పోయింది. గత మ్యాచ్‌ హీరో రవి బిష్ణోయ్‌ (2/25).. జోరు కొనసాగిస్తూ వరుస బంతుల్లో రోహిత్‌ (8), సూర్యకుమార్‌ (0)లను ఔట్‌ చేసి పంజాబ్‌కు అదిరే ఆరంభాన్నిచ్చాడు. ఈ దశలో డికాక్‌ (27; 29 బంతుల్లో 2×4), సౌరభ్‌ తివారి నిలకడగా ఆడినా.. స్కోరు వేగం పెంచలేకపోయారు. పదో ఓవర్లో జట్టు స్కోరు 61 వద్ద షమి.. డికాక్‌ను బౌల్డ్‌ చేయడంతో ముంబయికి ఇబ్బందులు తప్పలేదు. 16వ ఓవర్లో తివారి ఔటయ్యేసరికి స్కోరు 92 పరుగులే. అయితే 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో హర్‌ప్రీత్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన హార్దిక్‌.. చివరి 4 ఓవర్లలో చెలరేగిపోయాడు. పొలార్డ్‌ (15 నాటౌట్‌; 7 బంతుల్లో 1×4, 1×6)కూడా కొన్ని భారీ షాట్లు ఆడటంతో మ్యాచ్‌ ముంబయి వైపు తిరిగింది. షమి వేసిన 19వ ఓవర్లో చివరి నాలుగు బంతులకు వరుసగా 4, 2, 4, 6 రాబట్టిన పాండ్య మ్యాచ్‌ను ముగించాడు. 4 ఓవర్లలో 40 పరుగులతో కష్టంగా కనిపించిన ఛేదన.. ఒక ఓవర్‌ మిగిలుండగానే పూర్తయిపోయింది.

పంజాబ్‌.. పడి లేచి:  నెమ్మదిగా ఉండి, బ్యాటింగ్‌ కష్టంగా సాగిన పిచ్‌పై మొదట పరుగుల కోసం కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ శ్రమించాల్సి వచ్చింది. కెప్టెన్‌ రాహుల్‌, మన్‌దీప్‌ బంతికో పరుగు చొప్పున చేయగలిగారంతే. పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్‌ మన్‌దీప్‌ (15) వికెట్‌ కోల్పోయి 38 పరుగులే చేసింది. ఆ తర్వాత పొలార్డ్‌ ఒకే ఓవర్లో గేల్‌ (1), రాహుల్‌ (21)ల వికెట్లు తీసి పంజాబ్‌ను గట్టి దెబ్బ తీశాడు. వెంటనే పూరన్‌ (2)ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో 8 ఓవర్లకు కింగ్స్‌ 50/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో 100 అయినా చేస్తుందా అనుకున్న ఆ జట్టును మార్‌క్రమ్‌, దీపక్‌ హుడా (28; 26 బంతుల్లో 1×4, 1×6) ఆదుకున్నారు. స్పిన్నర్లు కృనాల్‌, చాహర్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసినా.. బౌల్ట్‌ (3-0-30-0) బౌలింగ్‌లో ఇద్దరూ స్వేచ్ఛగా పరుగులు  రాబట్టారు. వీరి భాగస్వామ్యం 50, స్కోరు 100 దాటి పంజాబ్‌ మెరుగైన స్థితికి చేరుకుంది.

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బుమ్రా (బి) పొలార్డ్‌ 21; మన్‌దీప్‌ ఎల్బీ (బి) కృనాల్‌ 15; గేల్‌ (సి) హార్దిక్‌ (బి) పొలార్డ్‌ 1; మార్‌క్రమ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 42; పూరన్‌ ఎల్బీ (బి) బుమ్రా 2; దీపక్‌ హుడా (సి) పొలార్డ్‌ (బి) బుమ్రా 28; హర్‌ప్రీత్‌ బ్రార్‌ నాటౌట్‌ 14; ఎలిస్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 135; వికెట్ల పతనం: 1-36, 2-39, 3-41, 4-48, 5-109, 6-123; బౌలింగ్‌: కృనాల్‌ పాండ్య 4-0-24-1; బౌల్ట్‌ 3-0-30-0; బుమ్రా 4-0-24-2; కౌల్టర్‌నైల్‌ 4-0-19-0; పొలార్డ్‌ 1-0-8-2; రాహుల్‌ చాహర్‌ 4-0-27-1

ముంబయి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) మన్‌దీప్‌ (బి) బిష్ణోయ్‌ 8; డికాక్‌ (బి) షమి 27; సూర్యకుమార్‌ (బి) బిష్ణోయ్‌ 0; సౌరభ్‌ తివారి (సి) రాహుల్‌ (బి) ఎలిస్‌ 45; హార్దిక్‌ నాటౌట్‌ 40; పొలార్డ్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (19 ఓవర్లలో 4 వికెట్లకు) 137; వికెట్ల పతనం: 1-16, 2-16, 3-61, 4-92; బౌలింగ్‌: మార్‌క్రమ్‌ 3-0-18-0; షమి 4-0-42-1; అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-29-0; రవి బిష్ణోయ్‌ 4-0-25-2; నాథన్‌ ఎలిస్‌ 3-0-12-1; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 1-0-11-0


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని