INDvsSL: గబ్బర్‌సేన లక్ష్యం 263

తొలి వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. టీమ్‌ఇండియా ముందు మంచి స్కోరే నిర్దేశించింది. మొత్తం 50 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది...

Updated : 18 Jul 2021 19:34 IST

చివర్లో పట్టు కోల్పోయిన భారత బౌలర్లు..

కొలంబో: తొలి వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. టీమ్‌ఇండియా ముందు మంచి స్కోరే నిర్దేశించింది. మొత్తం 50 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. చివర్లో టెయిలెండర్లు కరుణరత్నె(43 నాటౌట్‌; 35 బంతుల్లో 1x4, 2x6), చమీరా (13; 7 బంతుల్లో 1x4, 1x6) ధాటిగా ఆడి లంక జట్టుకు పోరాడే స్కోర్‌ అందించారు. అంతకుముందు కెప్టెన్‌ దాసున్‌ షనక (39; 50 బంతుల్లో 2x4, 1x6), అసలంక (38; 65 బంతుల్లో 1x4) నిలకడగా ఆడి ఐదో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (32; 35 బంతుల్లో 2x4, 1x6), మినోద్‌ భానుక (27; 44 బంతుల్లో 3x4) సైతం శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు.

ఈ క్రమంలోనే చాహల్‌ బౌలింగ్‌లో ఫెర్నాండో మనీశ్‌ పాండేకు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆపై కుల్‌దీప్‌ వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ భానుక రాజపక్స (24; 22 బంతుల్లో 2x4, 2x6), మరో ఓపెనర్‌ మినోద్‌ భానుకను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌ పంపాడు. తర్వాత ధనుంజయ డి సిల్వను(14) కృనాల్‌ పాండ్య బోల్తా కొట్టించాడు. అప్పటికి లంక స్కోర్‌ 25 ఓవర్లకు 117/4గా నమోదైంది. ఆ తర్వాత జోడీ కట్టిన అసలంక, షనక ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అనంతరం వారు పరుగుల వేగం పెంచే క్రమంలో స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. దీపక్‌ చాహర్‌.. అసలంకను పెవిలియన్‌ పంపగా, తర్వాత చాహల్‌.. షనకను ఔట్‌ చేశాడు. అనంతరం భారత బౌలర్లు పట్టు కోల్పోవడంతో టెయిలెండర్లు ధాటిగా ఆడారు. దాంతో టీమ్‌ఇండియా లక్ష్యం 263 పరుగులుగా నమోదైంది. భారత బౌలర్లలో యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, దీపక్‌ చాహర్‌ తలో రెండు వికెట్లు తీయగా కృనాల్‌, హార్దిక్‌ పాండ్య చెరో వికెట్‌ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు