T20 World Cup: భారత్‌కు ఎదురే లేదు

2 మ్యాచ్‌లు.. 345 పరుగులు.. రిటైర్డ్‌ ఔట్‌లను మినహాయిస్తే కోల్పోయిన వికెట్లు 3.. ఈ గణాంకాలు చూస్తే అర్థమైపోతుంది టీ20 ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం ఎలా సాగిందో! రెండు

Updated : 21 Oct 2021 07:57 IST

ఆసీస్‌పై ఘనవిజయం

2 మ్యాచ్‌లు.. 345 పరుగులు.. రిటైర్డ్‌ ఔట్‌లను మినహాయిస్తే కోల్పోయిన వికెట్లు 3.. ఈ గణాంకాలు చూస్తే అర్థమైపోతుంది టీ20 ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ ఆధిపత్యం ఎలా సాగిందో! రెండు మ్యాచ్‌ల్లోనూ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ దూకుడుగా ఆడి ప్రత్యర్థుల బౌలింగ్‌ను తుత్తునియలు చేశారు. అలవోకగా లక్ష్యాల్ని ఛేదించి ప్రధాన టోర్నీ ముంగిట ఆత్మవిశ్వాసం పెంచుకున్నారు. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్‌.. బుధవారం రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది.

దుబాయ్‌

టీ20 ప్రపంచకప్‌ తొలి వార్మప్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లే కోల్పోయి ఛేదించిన భారత్‌.. బుధవారం ఆస్ట్రేలియాపై 153 పరుగుల లక్ష్యాన్ని ఇంకా సులువుగా ఉఫ్‌మనిపించేసింది. లక్ష్యాన్ని భారత్‌ 17.5 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పేరుకు రెండు వికెట్లు పడ్డాయి కానీ.. ఆస్ట్రేలియా బౌలర్లు పడగొట్టింది ఒక్క వికెట్టే. రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ అవడం వల్ల భారత్‌ రెండు వికెట్లు కోల్పోయినట్లయింది. అశ్విన్‌ (2/8) ధాటికి ఇన్నింగ్స్‌ ఆరంభంలో విలవిలలాడిన ఆసీస్‌.. స్టీవ్‌ స్మిత్‌ (57; 48 బంతుల్లో 7×4), మ్యాక్స్‌వెల్‌ (37; 28 బంతుల్లో 5×4), స్టాయినిస్‌ (41 నాటౌట్‌; 25 బంతుల్లో 4×4, 1×6)ల పోరాటంతో కోలుకుని 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది.

అలవోకగా..: ఛేదనలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది. తొలి మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకుని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన రోహిత్‌ (60; 41 బంతుల్లో 5×4, 3×6) చెలరేగి ఆడి ఫామ్‌ను చాటుకున్నాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (39; 31 బంతుల్లో 2×4, 3×6) జోరు కొనసాగించాడు. సూర్యకుమార్‌ (38 నాటౌట్‌; 27 బంతుల్లో 5×4, 1×6) కూడా ఫామ్‌ అందుకోవడం సానుకూలాంశం. ఆసీస్‌ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. కమిన్స్‌ (0/33) సహా ప్రధాన బౌలర్లందరూ తేలిపోయారు. ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించిన ఆసీస్‌.. ఒకే ఒక్క వికెట్‌ సాధించింది. రాహుల్‌ను క్యాచ్‌ ఔట్‌ చేయడం ద్వారా అగార్‌ (1/14) ఈ వికెట్‌ సాధించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసిన భారత్‌.. 10 ఓవర్లకు రాహుల్‌ వికెట్‌ నష్టపోయి 73/1తో నిలిచింది. అప్పటిదాకా కొంచెం నెమ్మదిగా ఆడిన రోహిత్‌.. తర్వాత చెలరేగాడు. 36 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. 15వ ఓవర్లో జట్టు స్కోరు 127 పరుగుల వద్ద అతను రిటైర్డ్‌ ఔట్‌ కాగా.. సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య (14 నాటౌట్‌) మిగతా పని పూర్తి చేశారు.

అశ్విన్‌ అదరహో: అంతకుముందు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరు ప్రకారం.. 152 పరుగులు చేయడం అనూహ్యమే. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో అశ్విన్‌ (2/8) వరుస బంతుల్లో వార్నర్‌ (1), మిచెల్‌ మార్ష్‌ (0)లను వికెట్ల ముందు బలిగొని ఆస్ట్రేలియాను గట్టి దెబ్బ తీశాడు. కాసేపటికే జడేజా (1/35).. ఫించ్‌ (8)ను ఔట్‌ చేశాడు. అతను కూడా వికెట్ల ముందే దొరికిపోయాడు. 11/3తో ఆసీస్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్టీవ్‌ స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ పట్టుదలతో ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించాక మ్యాక్స్‌వెల్‌.. రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అక్కడి నుంచి స్మిత్‌, స్టాయినిస్‌ల జోరు సాగింది. చివరి ఓవర్లలో ఇద్దరూ ధాటిగా ఆడటంతో ఆసీస్‌ భారత్‌ ముందు గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిలిపింది. ఈ మ్యాచ్‌కు ప్రధాన పేసర్లు బుమ్రా, షమిలిద్దరూ విశ్రాంతి తీసుకున్నారు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ ఎల్బీ (బి) అశ్విన్‌ 1; ఫించ్‌ ఎల్బీ (బి) జడేజా 8; మిచెల్‌ మార్ష్‌ (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 0; స్టీవ్‌ స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) భువనేశ్వర్‌ 57; మ్యాక్స్‌వెల్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 37; స్టాయినిస్‌ నాటౌట్‌ 41; వేడ్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో  5 వికెట్లకు) 152; వికెట్ల పతనం: 1-6, 2-6, 3-11, 4-72, 5-148; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-27-1; అశ్విన్‌ 2-0-8-2; జడేజా 4-0-35-1; శార్దూల్‌ 3-0-30-0; కోహ్లి 2-0-12-0; రాహుల్‌ చాహర్‌ 3-0-17-1; వరుణ్‌ చక్రవర్తి 2-0-23-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) వార్నర్‌ (బి) అగార్‌ 39; రోహిత్‌ రిటైర్డ్‌ ఔట్‌ 60; సూర్యకుమార్‌ నాటౌట్‌ 38; పాండ్య నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 153; వికెట్ల పతనం: 1-68, 2-127; బౌలింగ్‌: స్టార్క్‌ 2-0-14-0; కమిన్స్‌ 4-0-33-0; అగార్‌ 2-0-14-1; జంపా 3-0-29-0; కేన్‌ రిచర్డ్‌సన్‌ 1.5-0-20-0; స్టాయినిస్‌  2-0-16-0; మిచెల్‌ మార్ష్‌ 2-0-17-0; మ్యాక్స్‌వెల్‌ 1-0-10-0


బ్యాటింగ్‌ సూపర్‌.. బౌలింగ్‌ మాత్రం..

వార్మప్‌ మ్యాచ్‌లను భారత బ్యాట్స్‌మెన్‌ బాగా ఉపయోగించుకున్నారు. బ్యాటింగ్‌ పరంగా భారత్‌కు చింతేమీ లేనట్లే. ఓపెనర్‌గా రాహుల్‌ రాణించడంతో ప్రపంచకప్‌ ప్రధాన రౌండ్లో అతనే రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించబోతున్నాడన్నది స్పష్టం. ఇంగ్లాండ్‌పై చెలరేగిన ఇషాన్‌, ఈ మ్యాచ్‌లో రాణించిన సూర్యకుమార్‌లకు తుది జట్టులో చోటు ఖాయమైనట్లే. బ్యాటింగ్‌ ఆర్డర్‌ విషయంలో భారత్‌కు వార్మప్‌ మ్యాచ్‌ల ద్వారా స్పష్టత వచ్చినట్లే. ఇంగ్లాండ్‌పై షమి, ఈ మ్యాచ్‌లో అశ్విన్‌, రాహుల్‌ చాహర్‌ సత్తా చాటడం బౌలింగ్‌ పరంగా భారత్‌కు సానుకూలాంశాలు. భువనేశ్వర్‌ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఒక్క వికెట్టే తీశాడు. అది కూడా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో పడగొట్టింది. శార్దూల్‌ ఠాకూర్‌ 3 ఓవర్లలో 30 పరుగులిచ్చి వికెట్‌ తీయకపోవడమూ ఆందోళన కలిగించేదే.

రోహిత్‌ కెప్టెన్సీ.. కోహ్లి బౌలింగ్‌: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ భారత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం విశేషం. అలాగని కోహ్లి ఏమీ విశ్రాంతి తీసుకోలేదు. కోహ్లి జట్టులో ఉన్నా.. రోహితే టాస్‌కు రావడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. మ్యాచ్‌లోనూ అతనే సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. ఇంకో విశేషం ఏంటంటే.. ఎన్నో ఏళ్ల తర్వాత కోహ్లి ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేశాడు. అతను 2 ఓవర్లలో వికెట్‌ లేకుండా 12 పరుగులిచ్చాడు. ఈ ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పబోతున్న నేపథ్యంలో వార్మప్‌ మ్యాచ్‌కు రోహిత్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టడం చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని