T20 World Cup: ఒకే ఒక ఆశ

కెప్టెన్‌గా అతడు తక్కువేమీ కాదు. టెస్టుల్లో చిరస్మరణీయ విజయాలు అందించాడు. వన్డేలు, టీ20ల్లోనూ జట్టును విజయవంతంగా నడిపించాడు. గణాంకాలు అతడివైపు ఉన్నాయి. కానీ ఒకే ఒక్క లోటు

Updated : 22 Oct 2021 06:51 IST

కెప్టెన్‌గా అతడు తక్కువేమీ కాదు. టెస్టుల్లో చిరస్మరణీయ విజయాలు అందించాడు. వన్డేలు, టీ20ల్లోనూ జట్టును విజయవంతంగా నడిపించాడు. గణాంకాలు అతడివైపు ఉన్నాయి. కానీ ఒకే ఒక్క లోటు మాత్రం అతణ్ని వెంటాడుతూనే ఉంది. అదే ఐసీసీ ట్రోఫీ. ఇక అతడికి ఉన్నది బహుశా.. ఒకే అవకాశం. మరి టీ20 ప్రపంచకప్‌తోనైనా కోహ్లి.. ట్రోఫీ కలను నెరవేర్చుకుంటాడా, కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ను పరిపూర్ణం చేసుకుంటాడా!

ఈనాడు క్రీడావిభాగం

సారథిగా ఆరంభంలోనే టీ20 ప్రపంచప్‌ (2007) గెలిచి అభిమానుల మనసులు గెలిచిన ధోని.. 2011 ప్రపంచకప్పుతో కీర్తి శిఖరాన్నందుకున్నాడు. అతడి కెప్టెన్సీలో టీమ్‌ఇండియా మరెన్నో అపురూప విజయాలు సాధించినా.. ధోనీని ప్రత్యేకంగా నిలిపేవి ఈ కప్పులే. మేటి బ్యాట్స్‌మన్‌గా ధోని నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్న కోహ్లి.. తనూ ఒక్కసారైనా కప్పును ముద్డాడాలని కోరుకోవడం సహజం. కానీ ఇప్పటి వరకు ఆ కల నెరవేరలేదు. ఇటీవల అతడి సారథ్యంలోని జట్టు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరినా.. కప్పు మాత్రం అందలేదు. ఈ చివరి అవకాశంలోనైనా ట్రోఫీని అందుకోలేకపోతే ఆ వెలితి అతడికి ఎప్పటికీ ఉండిపోతుంది.

చివరి ఛాన్స్‌ ఎందుకంటే..: కోహ్లి అంటేనే పరుగుల యంత్రం. అన్ని ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారించాడు. శతకాలపై శతకాలు బాదాడు. అలాంటి కోహ్లి 2019 నుంచి బ్యాటుతో తడబడుతున్నాడు. శతకం సాధించి చాలా రోజులే అయింది. ఈ నేపథ్యంలో.. అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా ఉండడం తనపై భారాన్ని పెంచుతోందంటూ అతడు ఈ ప్రపంచకప్‌ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌ సారథ్య బాధ్యతల నుంచీ తప్పుకున్నాడు. ఒక్క ట్రోఫీ కూడా గెలవని నేపథ్యంలో వన్డే కెప్టెన్సీని వదులుకోవాలనే ఒత్తిడి అతడిపై ఉందన్న చర్చ నడుస్తోంది. అసలు ఆ ఒత్తిడి వల్లే...వచ్చే ఏడాదే మరో ప్రపంచకప్‌ ఉన్నా అతడు పొట్టి ఫార్మాట్‌ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడన్న వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి. వన్డే కెప్టెన్‌గా ప్రస్తుతానికి కొనసాగినా.. ఆ ఫార్మాట్లో సారథిగా 2023 ప్రపంచకప్‌ వరకూ ఉంటాడా అన్నది సందేహమే. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కూడా ఆ ఏడాదిలోనే. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఈ నేపథ్యంలో.. వాస్తవిక కోణంలో చూస్తే కెప్టెన్‌గా కప్పు అందుకోవడానికి కోహ్లీకి ఇదే ఆఖరి ఛాన్స్‌ కావొచ్చు. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌, పదునైన పేస్‌  దళం, మ్యాచ్‌ గమనాన్ని మార్చగల స్పిన్నర్లతో బలంగా ఉన్న టీమ్‌ఇండియాకు.. కోహ్లీకి కప్పును అందించే  దమ్ముందనడంలో సందేహం లేదు. కానీ అసలు టోర్నమెంట్లో ఎలా ఆడతారో చూడాలి. అయితే పరిస్థితులు మారాయి. మరింతగా మారనున్నాయి. ఇకపై కోహ్లి ఒకప్పటిలా తిరుగులేని విధంగా పెత్తనం చేయగలడా అన్నది ప్రశ్న. తనకెంతో సన్నిహితుడైన కోచ్‌ రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తోంది. ద్రవిడ్‌ కోచ్‌గా బాధ్యతలు అందుకోవడం దాదాపుగా ఖాయమైంది. ధోని.. టోర్నీకి మెంటార్‌గా నియమితుడయ్యాడు. ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌ బాధ్యతలు అందుకోవడానికి రోహిత్‌ సిద్ధమైపోయాడు. ఈ ప్రపంచకప్‌ కోహ్లీకి సవాలుతో కూడుకున్నదే. కప్పు గెలవకపోతే గెలవలేదంటారు. ఒకవేళ గెలిస్తే మిగతా వాళ్ల నుంచి విలువైన సలహాలు, సూచనలు విజయంలో కీలకమయ్యాయనే వ్యాఖ్యలు వినిపిస్తాయి. ఈ విషయంలో ఇప్పుడు కోహ్లి చేయగలిగిందేమీ లేదు. విశేషమేంటంటే.. కెప్టెన్‌గా అతడికిదే తొలి టీ20 ప్రపంచకప్‌.

అయినా గొప్పే..: ఐసీసీ కప్పు గెలిచాడా లేదా అన్న దాని ఆధారంగా కెప్టెన్‌గా కోహ్లీని అంచనా వేసే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. కానీ టీ20 కెప్టెన్‌గా అతడి సామర్థ్యాన్ని ఏమాత్రం తక్కువ చేయలేం. అతడి నాయకత్వంలో గత 27 టీ20ల్లో భారత్‌ 14 గెలిచింది. అతడి  కెప్టెన్సీలోనే భారత్‌ దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో పొట్టి సిరీస్‌లు సాధించింది. మొత్తంగా భారత టీ20 కెప్టెన్‌గా అతడి గెలుపు శాతం 65.11. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ కోహ్లీనే. 52.65 సగటుతో 3159 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్పుల్లో బ్యాట్స్‌మన్‌గా అతడికి అద్భుత రికార్డు ఉంది. అత్యధిక సగటు (86.66) అతడి సొంతం. గేల్‌తో కలిసి టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక అర్ధశతకాల రికార్డు (9)నూ అతడు కలిగి ఉన్నాడు. బ్యాట్స్‌మన్‌గా టీ20ల్లో అతడి స్థానాన్ని భర్తీ చేయడం దాదాపుగా అసాధ్యం. మరి కెప్టెన్‌గా? పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రస్తుత బెంచ్‌ స్ట్రెంగ్త్‌, ఫిట్‌నెస్‌ ప్రమాణాలు చూస్తే.. కోహ్లి వారసత్వానికి ఢోకా లేదనిపిస్తోంది. అతడి కెప్టెన్సీ తీరు, వూహ్యాలపై  విమర్శలు లేకపోలేదు. ఇవన్నీ పక్కనపెడితే ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రపంచకప్‌ను కోహ్లి అందుకోగలడా లేదా అన్నదే ఆసక్తికరం. కోహ్లీకి నచ్చినా నచ్చకపోయినా.. ట్రోఫీ ట్రోఫీనే. జనాలు చివరికి అతడు దాన్ని అందుకున్నాడా లేదా అన్నదే చూస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని