పాక్‌ ఆటగాళ్లకు అండగా ఉండాలి: అఫ్రిది

కష్ట సమయంలో పాకిస్థాన్‌ ఆటగాళ్లకు అండగా ఉండాలని మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది అభిమానులకు, విమర్శకులకు పిలుపునిచ్చాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో ఆడిన మూడో వన్డేలోనూ దాయాది జట్టు ఓటమిపాలవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది...

Published : 15 Jul 2021 11:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కష్ట సమయంలో పాకిస్థాన్‌ ఆటగాళ్లకు అండగా ఉండాలని మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది అభిమానులకు, విమర్శకులకు పిలుపునిచ్చాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో ఆడిన మూడో వన్డేలోనూ దాయాది జట్టు ఓటమిపాలవ్వడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రధాన ఆటగాళ్లు లేని ఇంగ్లాండ్‌ ద్వితీయశ్రేణి జట్టు పాక్‌పై 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేయడం అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలోనే అఫ్రిది ఓ వీడియోలో మాట్లాడుతూ ఇలా స్పందించాడు.

‘ఇప్పుడున్న పాకిస్థాన్‌ ఆటగాళ్లు నైపుణ్యం, సామర్థ్యం పరంగా అత్యుత్తమ ఆటగాళ్లు. నిజం చెప్పాలంటే ఈ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. ఇంకొంత మంది కొంతకాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వీళ్లు మంచి ఆటగాళ్లు. సరిగ్గా ఉపయోగించుకోవాలి. వారిలో విజయకాంక్ష నెలకొల్పుతూ ప్రోత్సహించాలి. ఇలాంటి కష్టసమయాల్లో అండగా ఉండాలి. మైదానంలో వాళ్లు పోరాడేంతవరకు నేను ఓటములను అంగీకరిస్తాను. అయితే, కొద్దికాలంగా క్రికెట్‌ ఎంతో మారిపోయింది. ఇప్పుడు విజయాలు సాధించాలంటే దంచికొట్టడమే పనిగా పెట్టుకోవాలి. అంతకుమించిన దారి లేదు’ అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

అనంతరం రాబోయే టీ20 ప్రపంచకప్‌పై స్పందించిన మాజీ సారథి.. యూఏఈలో పాకిస్థాన్‌ జట్టుకు ఘనచరిత్ర ఉందని పేర్కొన్నాడు. ‘యూఏఈలో మనకు మంచి రికార్డు ఉంది. గతంలో పలు మేటి జట్లను కూడా అక్కడ ఓడించాం. అదే ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో మన జట్టుకు కలిసివస్తుంది. అక్కడి పిచ్‌లపై స్పిన్నర్లు, బ్యాట్స్‌మెన్‌ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది’ అని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉండగా, తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో పాక్‌ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత ఆ జట్టు బ్యాటింగ్‌ చేసి 331/9 భారీ స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (158; 139 బంతుల్లో 14x4, 4x4) భారీ శతకం సాధించగా రిజ్వాన్‌ (74; 58 బంతుల్లో 8x4) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఇంగ్లిష్‌ జట్టులో జేమ్స్‌ విన్స్‌ (102; 95 బంతుల్లో 11x4) శతకం సాధించగా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ లెవిస్‌ గ్రెగోరీ (77; 69 బంతుల్లో 6x4, 3x6) రాణించాడు. దాంతో ఆతిథ్య జట్టు 48 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని