
IPL 2021 CHAMPION: గర్జించిన చెన్నై సింహాలు
గతేడాది ఘోర పరాభవం...
జట్టులో లుకలుకలు వచ్చాయని రూమర్లు..
సారథిగా ఇక ధోనీ మాయ ముగిసిందనే మాటలు..
వీటన్నింటినీ దాటుకుని ఐపీఎల్ 14వ సీజన్ ఛాంపియన్‌గా అవతరించింది చెన్నై సూపర్ కింగ్స్..
మరోవైపు లీగ్ దశ ఆరంభంలో ఆపసోపాలు.. సెకండ్ ఫేజ్‌కు వచ్చేసరికి దిమ్మదిరిగే విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్.. అదే ఊపులో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న దిల్లీ, బెంగళూరు జట్లను ఓడించి మరీ ఫైనల్‌కు దూసుకొచ్చింది.. అయితే సీఎస్‌కే ముందు కేకేఆర్ తలవంచక తప్పలేదు.
ఇంటర్నెట్ డెస్క్: రెండు ఫేజుల్లో జరిగిన ఐపీఎల్ 2021వ సీజన్ విజేతగా సీఎస్‌కే నిలిచింది. కీలకమైన తుదిపోరులో కేకేఆర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో సీఎస్‌కే చేతిలో పరాజయం మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఓపెనర్లు ఇద్దరూ అర్ధ శతకాలతో మంచి ఆరంభం ఇచ్చినా ఫలితం దక్కలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం కేకేఆర్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్‌పై సీఎస్‌కే 27 పరుగుల తేడాతో విజయం సాధించి నాలుగో ఐపీఎల్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ను డుప్లెసిస్ అందుకున్నాడు. సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (635) టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్‌గానూ రుతురాజ్ ఎంపికయ్యాడు. గైక్వాడ్ తర్వాత ఈ సీజన్‌లో ఎక్కువ పరుగులు చేసింది డుప్లెసిస్ (633) కావడం విశేషం. అత్యధిక వికెట్లను పడగొట్టే వారికి ఇచ్చే పర్పల్ క్యాప్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ (32) అందుకున్నాడు.
ఛేదనలో ఓపెనర్లు అదుర్స్.. కానీ
193 పరుగుల భారీ లక్ష్యం ఎదురుగా ఉన్నా కోల్‌కతా అదరలేదు. దానికి కారణం మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (51: 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (50: 5 ఫోర్లు, 3 సిక్సర్లు). వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం అందించి గట్టి పునాది వేశారు. అయితే వెంకటేశ్ హాఫ్ సెంచరీ పూర్తి కాగానే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణా (0), సునీల్ నరైన్ (2), ఇయాన్ మోర్గాన్ (4), దినేశ్ కార్తిక్ (9), షకిబ్ (0), త్రిపాఠి (2) తీవ్రంగా నిరాశ పరిచారు. దీంతో 91/1 నుంచి 125/8కి పడిపోయింది. 34 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లను కోల్పోవడం కేకేఆర్ పతనానికి దారితీసింది. చివర్లో శివమ్ మావి (20) బ్యాట్‌ను ఝళిపించినా అప్పటికే ఆలస్యమైంది. ఓటమి అంతరాన్ని తగ్గించేందుకు మాత్రమే దోహదపడింది. సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, హేజిల్‌వుడ్ 2, రవీంద్ర జడేజా 2.. చాహర్, బ్రావో చెరో వికెట్ తీశారు.
ఉతికేసిన చెన్నై బ్యాటర్లు ..
మంచి ఫామ్‌లో ఉన్న చెన్నై ఓపెనర్ల ద్వయం రుతురాజ్ గైక్వాడ్ (32: 3 ఫోర్లు, ఒక సిక్సర్), డుప్లెసిస్ (86: 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు అర్ధశతకం (61 పరుగులు) భాగస్వామ్యం నిర్మించారు. రుతురాజ్ ఔటైనప్పటికీ తర్వాత వచ్చిన ఉతప్ప (31: 3 సిక్సర్లు), మొయిన్ అలీ (37*: 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో కలిసి డుప్లెసిస్ కేకేఆర్ బౌలింగ్‌ను ఓ ఆటాడునుకున్నాడు. కోల్‌కతా బౌలర్లలో నరైన్ 2, మావి ఒక వికెట్ తీశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.