ఈ డెలివరీ బాయ్‌.. ఒలింపిక్స్‌ విజేత!

భుజం మీద బ్యాగ్‌తో, సైకిల్‌పై ఉన్న ఈ వ్యక్తిని చూశారా..

Updated : 21 Nov 2022 15:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భుజం మీద బ్యాగ్‌తో, సైకిల్‌పై ఉన్న ఈ వ్యక్తిని చూశారా.. వినియోగదారులు ఆర్డర్‌ చేసిన వస్తువులు అందించే డెలివరీ బాయ్‌.. అంతే కదా అనుకుంటున్నారా? అది కొంత వరకు నిజమే ఐనా ఆయనకు మరో గుర్తింపు ఉంది. రూబెన్‌ లిమార్డో అనే ఈ వ్యక్తి పోరాట కళలలో ఒకటైన ఫెన్సింగ్‌లో ఒలింపిక్‌ గోల్డ్‌ మెడల్‌ విజేత.

35 ఏళ్ల రూబెన్‌.. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ప్రథమ స్థానంలో నిలిచారు. 1904 తర్వాత లాటిన్‌ అమెరికా నుంచి ఒలింపిక్‌ పతకం గెల్చిన తొలి వ్యక్తి. వెనెజులాకు ఒలింపిక్‌ స్వర్ణం ఆర్జించిన రెండో క్రీడాకారుడు. అంతేకాకుండా 2021టోక్యో ఒలింపిక్స్‌లో కూడా ఆయన తన దేశం తరపున పాల్గొంటున్నారు. ఐతే ఇప్పుడు ఆన్‌లైన్‌ ఆహార సరఫరా సంస్థ ఉబెర్‌ ఈట్స్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. పలువురు ఇతర ఫెన్సర్లు కూడా తన మాదిరిగానే ఉన్నారని ఆయన వివరించారు. కాగా, ఈ సంగతి తెలుసుకున్న ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు.

మహమ్మారి కారణంగా తమకు అందే ప్రోత్సాహకాల్లో కోత పడిందని.. అందుకే తాము ఈ దారి పట్టామన్నారు రూబెన్‌ లిమార్డో. పరిస్థితులకు అనుగుణంగా ఎవరి జరుగుబాటు వారే చూసుకోవాలని.. ఇది కూడా మిగతావాటి మాదిరిగానే ఓ వృత్తి అని వివరించారు. తను ఈ ‘కొత్త’ వృత్తిలో రోజుకు 50 కిలోమీటర్లు తిరగాల్సి వస్తోందని.. ప్రతిఫలంగా తనకు వారానికి 100 యూరోలు (సుమారు రూ.9 వేలు) లభిస్తాయని వెల్లడించారు. ఉద్యోగంలో చేరే ముందు ఆయనకు ఒక రోజు శిక్షణ ఇచ్చారట. అయితే, తాను భవిష్యత్తుపై ఆశల్ని కోల్పోలేదని.. తన అభ్యాసాన్ని మానలేదని రూబెన్‌ లిమార్డో స్పష్టం చేశారు. డెలివరీ అందచేసే ప్రతిసారీ .. అది తనను టోక్యో ఒలింపిక్స్‌ పతకానికి చేరువ చేస్తుందని తనకు తాను చెప్పుకుంటాడట ఈ నిజమైన ఛాంపియన్‌! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని