డ్రీమ్‌11లో చైనా పెట్టుబడులు

2020 ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌గా బీసీసీఐ డ్రీమ్‌11ను ఎన్నుకోవడాన్ని..

Published : 19 Aug 2020 16:42 IST

బీసీసీఐకి లేఖ రాసిన సీఏఐటీ

దిల్లీ: 2020 ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌గా బీసీసీఐ ‘డ్రీమ్‌11’ను ఎంచుకోవడాన్ని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) వ్యతిరేకించింది. డ్రీమ్‌11లో చైనా పెట్టుబడులు ఉన్నాయని పేర్కొంటూ బుధవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీకి లేఖ రాసింది. ‘2020 ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ను డ్రీమ్‌11కు అప్పగించడంతో తీవ్ర కలత చెందాం. ఆ  సంస్థలో చైనా పెట్టుడబులు ఉన్నాయి. చైనాకి చెందిన టెన్సెంట్ గ్లోబల్‌ అనే సంస్థ డ్రీమ్‌11లో ముఖ్య వాటాదారు’ అని పేర్కొంది. ‘డ్రీమ్‌11కు స్పాన్సర్‌షిప్‌ను కట్టబెట్టడం చైనా వస్తువులను బహిష్కరిస్తున్న భారతీయుల మనోభావాలను దెబ్బదీయడమే’ అని చైనా వస్తువులను బహిష్కరించాలనే ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న సీఏఐటీ ఆ లేఖలో స్పష్టం చేసింది. 

భారత్‌లో చైనా వస్తువుల బహిష్కరణ ఉద్యమం కొనసాగుతుండటంతో ఐపీఎల్ టైటిల్‌ స్పాన్సరర్‌గా కొన్నేళ్లపాటు కొనసాగిన మొబైల్‌ సంస్థ వివో ఈ మధ్యే తప్పుకుంది. దీంతో వచ్చే నెల దుబాయ్‌లో నిర్వహించే ఐపీఎల్‌ 13వ సీజన్‌ కోసం బీసీసీఐ కొత్త సంస్థలను ఆహ్వానించింది. స్వదేశీ కంపెనీలైన టాటా, బైజుస్‌, పతంజలి లాంటి సంస్థలతో పోటీ పడి రూ.222 కోట్లకు ఫాంటసీ క్రీడల నిర్వహణ సంస్థ డ్రీమ్‌11 ఆ హక్కులను దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని