Updated : 07 Dec 2020 11:52 IST

ఏడాదిగా కోహ్లీసేన జైత్రయాత్ర.. 

టీ20 క్రికెట్‌లో ‘పది’లమైన విజయాలు..

ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా తొలి రెండు వన్డేలు ఘోరంగా ఓటమిపాలయ్యేసరికి అంతా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నాయకత్వాన్ని విమర్శించారు. కానీ, అదే కోహ్లీ ఇప్పుడు రెండు గొప్ప ఘనతలు సాధించి అందరి చేతా శభాష్‌ అనిపించుకుంటున్నాడు. 2018-19 సీజన్‌లో కంగారూల గడ్డపై వన్డే, టెస్టు సిరీస్‌ గెలుపొందిన విరాట్‌.. అప్పుడు మిగిలిపోయిన టీ20 సిరీస్‌ను ఇప్పుడు కైవసం చేసుకున్నాడు. దీంతో దిగ్గజ ఆటగాడు, మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీకి వీలుకాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఏడాది కాలంగా పొట్టి క్రికెట్‌లో భారత్‌కు ఓటమే ఎరుగకుండా వరుసగా పది విజయాలు అందించాడు. ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా గెలవడంతోనే ఈ రెండు ఘనతలు దక్కాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ సాధించిన విజయాలేంటో గుర్తుచేసుకుందాం..

వెస్టిండీస్‌తో మొదలై..
గతేడాది డిసెంబర్‌లో టీమ్‌ఇండియా.. వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడింది. అప్పుడు తొలి పోరులో భారత్‌ గెలవగా రెండో మ్యాచ్‌లో కరీబియన్లు గెలిచారు. ఇక మూడో టీ20లో కోహ్లీసేన 67 పరుగులతో విజయం సాధించి జైత్రయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 240/3 భారీ స్కోర్‌ సాధించింది. రోహిత్‌(71), రాహుల్‌(91), విరాట్‌ కోహ్లీ (70) రెచ్చిపోయి ఆడారు. అనంతరం విండీస్‌ 173/8కే పరిమితమై సిరీస్‌ కోల్పోయింది. ఆపై జనవరిలో శ్రీలంకతో మరో మూడు టీ20ల సిరీస్‌ ఆడగా తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీసేనే విజయం సాధించింది. ఫైనల్‌ మ్యాచ్‌లోనూ భారత్‌ 201/6 మరోసారి భారీ స్కోర్‌ చేసింది. ఛేదనలో చేతులెత్తేసిన లంకేయులు 123 పరుగులకే ఆలౌటయ్యారు. దాంతో భారత్‌ వరుసగా 3 టీ20 మ్యాచ్‌లు గెలుపొందింది.

న్యూజిలాండ్‌లోనే అసలు మజా..

అదే జనవరిలో న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన భారత్‌ అక్కడ పొట్టి క్రికెట్‌లో విశేషంగా రాణించింది. 5-0తేడాతో కివీస్‌ను‌ వైట్‌వాష్‌ చేసి న్యూజిలాండ్‌ గడ్డపై పొట్టి సిరీస్‌ గెలుపొందింది. మరీ ముఖ్యంగా రెండు మ్యాచ్‌ల గురించి చెప్పుకోవాలి ఇక్కడ. మూడో మ్యాచ్‌లో ఇరు జట్లు 179 పరుగులు చేయగా, నాలుగో మ్యాచ్‌లో 165 పరుగులు చేశాయి. దీంతో ఆ రెండూ సూపర్‌ ఓవర్లకు వెళ్లాయి. కోహ్లీసేన ఆ రెండింటిలో విజయం సాధించి చివరి‌ మ్యాచ్‌లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 163/3 స్కోర్‌ సాధించగా, న్యూజిలాండ్‌ 156/9కే పరిమితమైంది. దీంతో భారత్‌ అప్పటివరకు వరుసగా 8 పొట్టి మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 

ఆస్ట్రేలియాలో తడబడుతూనే..

న్యూజిలాండ్‌ పర్యటన తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా లాక్‌డౌన్‌, ఆపై ఐపీఎల్‌ ఆడిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు.. అక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియా విమానం ఎక్కారు. ఈ నేపథ్యంలోనే సిడ్నీలో జరిగిన తొలి రెండు వన్డేల్లో ఘోరంగా విఫలమవ్వగా తర్వాత కాన్‌బెరాలో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించారు. దాంతో కాస్త ఊరట లభించింది. అదే ఆత్మవిశ్వాసంతో తొలి టీ20లో 11 పరుగులతో విజయం సాధించిన కోహ్లీసేన ఆదివారం రెండో మ్యాచ్‌లో 195 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. దీంతో ఏడాది కాలంగా భారత్‌ టీ20 క్రికెట్‌లో ఓటమే ఎరుగకుండా పయనిస్తోంది. ఇక మంగళవారం జరిగే మూడో టీ20లోనూ విజయం సాధిస్తే కోహ్లీసేన ఇంకో రికార్డు నెలకొల్పుతుంది. అదేంటంటే.. పొట్టి క్రికెట్‌లో వరుసగా 11 మ్యాచ్‌లు గెలుపొందిన అఫ్గానిస్థాన్‌తో సమానంగా నిలుస్తుంది. ఈ పసికూన జట్టు 2018-19 సీజన్‌లో ఓటమి రుచిచూడకుండా వరుసగా 12 మ్యాచ్‌లు గెలుపొందింది. 2016-17లో కూడా వరుసగా 11 మ్యాచ్‌ల్లో గెలిచి ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచింది.  ఈ నేపథ్యంలోనే కోహ్లీసేన మూడో టీ20 గెలిస్తే.. అఫ్గాన్‌తో సమానంగా రెండో స్థానంలో నిలుస్తుంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి..
లెక్క సరి
రసెల్‌ కన్నా పాండ్య ఉత్తమం: భజ్జీ

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని