టాప్‌లో కోహ్లీ‌: తర్వాత ధోనీ, రోహిత్

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రికార్డులు బద్దలుకొట్టడం కొత్తేమి కాదు. బరిలోకి దిగితే రికార్డుల మోత గ్యారెంటీ. అయితే అతడు తాజాగా ఓ ఘనత సాధించాడు. కానీ అది మైదానంలో కాదు, సామాజిక మాధ్యమంలో. 

Published : 15 Dec 2020 02:03 IST

ఇంటర్నెట్‌డెస్క్: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి రికార్డులు బద్దలుకొట్టడం కొత్తేమి కాదు. బరిలోకి దిగితే రికార్డుల మోత గ్యారెంటీ. అయితే అతడు తాజాగా ఓ ఘనత సాధించాడు. కానీ అది మైదానంలో కాదు, సామాజిక మాధ్యమంలో. ఈ ఏడాది భారత క్రీడాకారులందరిలో అతడి గురించే ఎక్కువ మంది ట్విటర్ వేదికగా ప్రస్తావించారని ‘ట్విటర్ ఇండియా’ తెలిపింది. అతడి తర్వాతి స్థానాల్లో మాజీ సారథి ఎంఎస్ ధోనీ, ఓపెనర్‌ రోహిత్ శర్మ ఉన్నారు. ఇక మహిళా అథ్లెట్లలో రెజ్లర్‌ గీతా ఫొగాట్ టాప్‌లో ఉండగా షట్లర్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, ఇటీవల కోహ్లీ ట్విటర్‌లో మరో రికార్డు సాధించిన విషయం తెలిసిందే. తండ్రి కాబోతున్నానని అతడు చేసిన ట్వీట్ ఈ ఏడాది అత్యధిక లైక్‌లు పొందిన ట్వీట్‌గా నిలిచింది.

అయితే ట్విటర్‌లో ధోనీ మరో ఘనత సాధించాడు. ఈ ఏడాది ఎక్కువమంది చేసిన రీట్వీట్ ధోనీదే. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు మహీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలకడం 130 కోట్ల మంది భారతీయులను నిరాశకు గురిచేసిందని, గడ్డు పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడిన అతడు యువతకు ఆదర్శంగా నిలిచాడని మోదీ ట్వీట్ చేశారు. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ ధోనీ బదులిచ్చాడు. కాగా, ఆ ట్వీట్ ఈ ఏడాది రీట్వీట్‌ల్లో టాప్‌గా నిలిచింది.

ఇక ట్విటర్‌లో ఈ ఏడాది క్రీడలకు సంబంధించిన హ్యాష్‌టాగ్స్‌లో ఐపీఎల్‌ అగ్రస్థానంలో నిలిచింది. మహమ్మారి కారణంగా ఈ ఏడాది లీగ్‌ ఆలస్యంగా జరిగిన సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా జరిగిన 13వ సీజన్‌లో ముంబయి ట్రోఫీని అందుకుంది. అయితే హ్యాష్‌టాగ్స్‌ ట్రెండింగ్‌లో ఐపీఎల్‌ తర్వాతి స్థానాల్లో విజిల్‌పోడు, టీమ్‌ఇండియా ఉన్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు మద్దతు ఇస్తూ అభిమానులు విజిల్‌పోడు పదాన్ని ఉపయోగిస్తుంటారు. కాగా, ట్విటర్‌లో ఈ ఏడాది విదేశీ క్రీడాకారులందరిలో ఎక్కువగా ప్రస్తావించిన జాబితాలో క్రిస్టియానో రొనాల్డో (ఫుట్‌బాల్‌ ఆటగాడు), డేవిడ్ వార్నర్ (ఆసీస్‌ క్రికెటర్‌), ఏబీ డివిలియర్స్‌ (దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక విదేశీ జట్ల గురించి.. ఫుట్‌బాల్‌కు సంబంధిచిన మాంచెస్టర్ యునైటెడ్‌, ఎఫ్‌సీ బార్సిలోనా, అర్సెనల్‌ టాప్‌లో ఉన్నాయని ట్విటర్ ఇండియా వెల్లడించింది.

ఇదీ చదవండి

బ్యాట్‌తో చుక్కలు.. బంతితో నిప్పులు

కోహ్లీసేన ‘క్రికెట్‌ బుర్ర’ మిస్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని