Updated : 12 Dec 2020 18:12 IST

కోహ్లీ లేకపోతే భారత్‌కు అంత నష్టమా?

విరాట్‌ సెలవులపై విశ్లేషకులు ఎందుకింత చర్చ?

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం పితృత్వ సెలవులపై విరాట్‌ కోహ్లీ స్వదేశానికి తిరిగి వెళ్తాడని ప్రకటించిన అనంతరం.. క్రికెట్ ప్రపంచమంతా భారత్‌×ఆసీస్‌ టెస్టు సిరీస్‌ గురించే చర్చిస్తోంది. కోహ్లీ లేని టీమిండియా కంగారూలకు పోటీ ఇవ్వలేదని, ఆసీస్‌దే పైచేయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అయితే తొలి టెస్టులో విజయం సాధిస్తుందని, కోహ్లీ లేని మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ 1-3తో భారత్‌ ముగిస్తుందని జోస్యం చెబుతున్నారు.

ఒక్క ఆటగాడు లేకపోతే జట్టుపై ఇంతలా ప్రభావం చూపిస్తుందానని అనిపించవచ్చు. కానీ గత కొన్నేళ్లుగా పరుగుల రారాజుగా కొనసాగుతూ అందరిలోనూ కోహ్లీ ఈ అభిప్రాయాలను సృష్టించాడు. సహచరులు విఫలమవుతున్నా భీకర పేసర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ సాధించిన రికార్డులే ఈ భావనను కలిగిస్తున్నాయి. అంతేగాక ఆస్ట్రేలియా ఆటగాళ్ల కవ్వింపులకు కళ్లెం వేయాలన్నా, ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించాలన్నా దూకుడైన బ్యాట్స్‌మన్, కెప్టెన్‌ భారత్‌కు అవసరం. 

కొందరు ఆటగాళ్లు  కొన్ని ఫార్మాట్లలో మాత్రమే సత్తా చాటుతుంటారు. పరిమిత ఓవర్లలో రాణిస్తే టెస్టుల్లో విఫలమవ్వడం, సుదీర్ఘ ఫార్మాట్‌లో మెరిస్తే వైట్‌ బాల్‌ క్రికెట్‌లో నిరాశపరుస్తుంటారు. మరికొందరు స్వదేశంలో రికార్డులు సృష్టిస్తే, విదేశాల్లో ఉసూరుమనిపిస్తుంటారు. కానీ, వేదికతో సంబంధం లేకుండా విరాట్‌ అన్ని ఫార్మాట్లలో నిలకడగా పరుగుల వరద పారిస్తూ మేటి బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తున్నాడు. ఫార్మాట్‌ను బట్టి బ్యాటింగ్‌ శైలిలో మార్పులు చేసుకుంటూ స్కోరుబోర్డును ముందుకు నడిపించడమే లక్ష్యంగా చేసుకుంటున్నాడు. అందుకే ఆస్ట్రేలియాలో ఏ ఇతర బ్యాట్స్‌మన్‌ సాధించలేని ఘనతలతో తానేంటో కోహ్లీ రుజువు చేశాడు‌.

అన్ని దేశాల్లో కంటే ఆస్ట్రేలియాలో పర్యటించడం భిన్నం. బౌన్సర్లతో ఆసీస్‌ పేసర్లు బెంబేలెత్తిస్తుంటారు. శరీరాన్ని లక్ష్యంగా చేసుకుంటూ బంతులు సంధిస్తుంటారు. గాయాలపాలవుకుండా బ్యాట్స్‌మెన్‌ ఆడితే చాలు అనుకున్న రోజులూ ఉన్నాయి. అంతేకాదు ఆసీస్ ఆటగాళ్లు మాటలతో కవ్విస్తుంటారు. ఏకాగ్రతను దెబ్బతీస్తుంటారు. అందుకే ఆసీస్‌ పర్యటన అంటే ఆటగాళ్లు ఆటతో పాటు మానసికంగా సిద్ధమవుతుంటారు. కానీ కోహ్లీ మాత్రం కంగారూలకే కంగారు పెట్టించాడు. సవాళ్లను అధిగమిస్తూ ఆస్ట్రేలియాలో జరిగిన సుదీర్ఘ ఫార్మాట్‌ మ్యాచ్‌ల్లో ఆరు శతకాలు బాదేశాడు. ఇప్పటికే అయిదు టెస్టుసిరీస్‌ల కోసం ఆసీస్‌కు వెళ్లిన అతడు 12 మ్యాచ్‌ల్లో 55 సగటుతో 1274 పరుగులు సాధించాడు. ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్ దళంపై 50కి పైగా సగటుతో పరుగులు సాధించడం అంటే ఆషామాషీ కాదు.

పైగా విరాట్‌ సాధించిన శతకాలన్నీ దాదాపు ఒత్తిడిలోనే. 2011లో ఆసీస్‌ గడ్డపై తొలి టెస్టు ఆడిన విరాట్‌ 2012లో శతకం సాధించాడు. అడిలైడ్‌ వేదికగా జరిగిన ఈ టెస్టులో టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌ను ఆసీస్‌ 604/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేయగా.. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ 111 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి గంభీర్, సెహ్వాగ్‌, ద్రవిడ్‌, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్‌ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ పట్టుదలతో పరుగులు సాధించాడు. ప్రమాదకర బౌన్సర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైనప్పటికీ విరాట్‌ (116) ఇన్నింగ్స్‌పై ప్రశంసల జల్లు కురిసింది.

కోహ్లీ×మిచెల్‌..

అనంతరం 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ తన విశ్వరూపమే చూపించాడు. నాలుగు శతకాలు బాది 692 పరుగులు చేశాడు. అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఏకంగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీల మోత మోగించాడు. 115, 141 పరుగులు చేశాడు. కోహ్లీ దూకుడికి భారత్ 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందని భావించారంతా. కానీ 304 పరుగుల వద్ద కోహ్లీ ఏడో వికెట్‌గా వెనుదిరిడంతో ఆసీస్‌ ఊపిరిపీల్చుకుంది. తర్వాత కోహ్లీ మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో 169, 54 పరుగులు; సిడ్నీలో జరిగిన నాలుగో టెస్టులో 147, 46 పరుగులు సాధించాడు. ఈ పర్యటనలో కోహ్లీ×మిచెల్ జాన్సన్‌ మధ్య నెలకొన్న పోటీ అభిమానులకీ ఎప్పటికీ జ్ఞాపకమే. కోహ్లీని కవ్వించిన ఆసీస్‌ భారీ మూల్యమే చెల్లించుకుంది. మాటలతో రెచ్చగొట్టిన ఆసీస్ బౌలర్లకు బౌండరీలతో సమాధానమిచ్చాడు. అప్పటినుంచి భారత్‌తో సిరీస్‌ అంటే కోహ్లీని కవ్వించొద్దని ఆసీస్‌కు సీనియర్లు సలహాలు ఇస్తుంటారు.

71 ఏళ్ల కల..

2018-19 పర్యటనలో కోహ్లీ నిలకడగా పరుగులు సాధించినా ఒక్క శతకమే బాదాడు. అయితే నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. 71 ఏళ్ల కలను నిజం చేస్తూ కంగారూల గడ్డపై విజయకేతనం ఎగురవేశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో విజయం సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం 12 సార్లు ఆసీస్‌కు పర్యటించిన భారత్ విజేతగా నిలిచింది కోహ్లీ నాయకత్వంలోనే. ఇప్పుడు మరోసారి ఆసీస్‌పై పైచేయి సాధించడానికి టీమిండియా సన్నద్ధమవుతోంది. డిసెంబర్‌ 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. అయితే కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం టీమిండియాకు ప్రతికూలాంశమే. బలమైన పేస్ దళాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్నా, కవ్వింపులకు దీటుగా సమాధానమివ్వాలన్నా కోహ్లీ జట్టులో ఉండాల్సిందే. అందుకే విశ్లేషకులు, సీనియర్లు విరాట్ లేని జట్టు పటిష్ఠంగా ఉండదని అభిప్రాయపడుతున్నారు. మరి సారథి లేకుండా స్మిత్, వార్మర్, లబుషేన్‌తో కూడిన ఆసీస్‌ జట్టును టీమిండియా ఎలా ఢీకొంటుందా చూడాలి!!

- ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి

తండ్రి వ్యాఖ్యలను వ్యతిరేకించిన యువీ

ఇప్పుడైనా  ఆస్ట్రేలియాపై చెలరేగుతాడా?  

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని