వివోతో బీసీసీఐ కటీఫ్‌.. అధికారికంగా

అనుకున్నదే జరిగింది! ఐపీఎల్‌-2020కి వివో దూరమైంది. టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అంటే త్వరలో జరిగే ఐపీఎల్‌కు బోర్డు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సి ఉంటుంది...

Published : 06 Aug 2020 16:49 IST

ముంబయి: అనుకున్నదే జరిగింది! ఐపీఎల్‌-2020కి వివో దూరమైంది. టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అంటే త్వరలో జరిగే ఐపీఎల్‌కు బోర్డు కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవాల్సి ఉంటుంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఐదేళ్లు టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు రూ.2190 కోట్లతో బీసీసీఐతో వివో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. 2018-2022 వరకు ఇది అమల్లో ఉంటుంది. కాగా భారత్‌, చైనా సరిహద్దుల్లో ఉద్రికత్తల సెగ వివోకు బాగానే తగిలింది. ప్రభుత్వం కొన్ని రోజుల ముందే టిక్‌టాక్‌, హెలో వంటి డ్రాగన్‌ యాప్‌లను నిషేధించింది. ఈ క్రమంలోనే చైనీస్‌ కంపెనీ వివోతో ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్‌ పెరిగింది. అయినప్పటికీ దానినే  కొనసాగించేందుకు బీసీసీఐ నిర్ణయించింది. అయితే సోషల్‌ మీడియాలో విపరీతంగా వ్యతిరేకత ఎదురవ్వడంతో స్పాన్సర్‌గా కొనసాగేందుకు వివో విముఖత చూపినట్టు తెలిసింది.

‘ఐపీఎల్‌-2020తో భాగస్వామ్యం రద్దు చేసుకొనేదుకు బీసీసీఐ, వివో మొబైల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ నిర్ణయించాయి’ అని బీసీసీఐ ఏకవాక్య ప్రకటన విడుదల చేసింది. రద్దు చేస్తే డబ్బులు చెల్లిస్తారా? పరిహారం కోరారా? వచ్చే ఏడాది పరిస్థితి ఏంటి? అన్న వివరాలేమీ ఇవ్వలేదు. అయితే కొత్త స్పాన్సర్‌ కోసం బోర్డు రాజ్యాంగం ప్రకారం త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ఆస్కారం ఉంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌10 వరకు ఐపీఎల్‌-2020  జరగనున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని