టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఐసీసీ కీలక నిర్ణయం!

తొలిసారి నిర్వహిస్తున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా పలు టెస్టు మ్యాచ్‌లు రద్దవ్వడంతో పాయింట్ల పరంగా కాకుండా విజయాల శాతం ఆధారంగా జట్లను

Published : 16 Nov 2020 01:36 IST

ఇంటర్నెట్‌డెస్క్: తొలిసారి నిర్వహిస్తున్న టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా పలు టెస్టు మ్యాచ్‌లు రద్దవ్వడంతో పాయింట్ల పరంగా కాకుండా విజయాల శాతం ఆధారంగా జట్లను ఫైనల్‌కు ఎంపిక చేస్తారని సమాచారం. సోమవారం నుంచి జరగనున్న ఐసీసీ చివరి త్రైమాసిక సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

మహమ్మారి కారణంగా రద్దైన మ్యాచ్‌లకు పాయింట్లను ఇరు జట్లకు సమానంగా ఇవ్వాలని ఐసీసీ తొలుత భావించింది. కానీ దాని బదులుగా విజయాల శాతం ప్రక్రియను కొనసాగించాలని యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టాప్‌-9 జట్లు రెండేళ్లలో ఆరు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ప్రతి సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయిస్తారు. ఉదాహరణకి నాలుగు టెస్టుల సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌కు 30 పాయింట్లు వస్తాయి. అదేవిధంగా రెండు టెస్టుల సిరీస్‌ అయితే ఒక మ్యాచ్‌కు 60 పాయింట్లు కేటాయిస్తారు. మొత్తంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే ఏడాది జూన్‌లో లార్డ్స్‌ వేదికగా ఫైనల్లో తలపడతాయి. గెలిచిన జట్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజేత‌గా నిలుస్తుంది.

ప్రస్తుతం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో విజయాల శాతం పరంగా చూస్తే.. ఆస్ట్రేలియా (296 పాయింట్లు, గెలుపు శాతం 82.22 ), భారత్‌ (360 పాయింట్లు, 75%), ఇంగ్లాండ్‌ (292 పాయింట్లు, 60.83%), న్యూజిలాండ్ (180 పాయింట్లు, 50%), పాకిస్థాన్‌ (166 పాయింట్లు, 39.52%) తొలి అయిదు స్థానాల్లో ఉన్నాయి. విజయాల శాతం ఆధారంగా ఫైనల్‌కు జట్లు అర్హత సాధిస్తాయని ఐసీసీ ప్రకటిస్తే.. జట్ల అవకాశాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం.

* స్వదేశంలో జరగనున్న పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ సిరీస్‌ల్లో న్యూజిలాండ్‌ విజయం సాధిస్తే 240 పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు కివీస్‌ గెలుపు శాతం 70కి చేరుతుంది.

* భారత్‌పై ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల్లో విజయం సాధిస్తే గెలుపు శాతం 86.67కి చేరుతుంది. దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లో మూడు టెస్టులు పరాజయాన్ని చవిచూస్తే ఆసీస్ గెలుపు శాతం 69.33కి పడిపోతుంది.

* ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్‌లను కైవసం చేసుకుంటే టీమిండియా ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే ఆస్ట్రేలియా చేతిలో నాలుగు టెస్టులు ఓటమిపాలై, ఇంగ్లాండ్‌పై అయిదు టెస్టులు విజయం సాధిస్తే.. టీమిండియా 480 పాయింట్లు, గెలుపు శాతం 66.67 సాధిస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో 1-3తో ఓడి, ఇంగ్లాండ్‌పై 5-0తో గెలిస్తే 510 పాయింట్లు, విజయాల శాతం 70.83 అవుతుంది. అదే విధంగా.. ఆస్ట్రేలియా చేతిలో 0-2తో సిరీస్‌ కోల్పోయి, ఇంగ్లాండ్‌పై 5-0తో విజయం సాధిస్తే 500 పాయింట్లు, 69.44 గెలుపు శాతం నమోదు చేస్తుంది. ఈ సందర్భంలో న్యూజిలాండ్ గట్టిపోటీనిచ్చే అవకాశం ఉంటుంది. స్వదేశంలో కివీస్‌ సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేస్తే భారత్‌కు అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని