‘భారత్‌కు అది ప్రతికూలాంశం’

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా భారత్×ఆసీస్ టెస్టు సిరీస్‌ గురించే చర్చిస్తోంది. సమవుజ్జీవుల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు...

Published : 26 Nov 2020 01:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా భారత్×ఆసీస్ టెస్టు సిరీస్‌ గురించే చర్చిస్తోంది. సమవుజ్జీవుల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్‌ వకార్ యూనిస్‌ కూడా టెస్టు సిరీస్‌ గురించి తన యూట్యూబ్‌ ఛానెల్‌లో విశ్లేషించాడు. 2018లో స్వదేశంలో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ కోల్పోవడంతో ఈ సారి టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు ప్రయత్నిస్తుందని అన్నాడు.

‘‘మెరుగైన పేస్ దళంతో పాటు డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్ జట్టులో ఉండటం, అంతేగాక స్వదేశంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో ఆస్ట్రేలియా ఎంతో పటిష్ఠంగా కనిపిస్తోంది. అయితే టీమిండియాలోనూ గొప్ప బౌలర్లు ఉన్నారు. గత పర్యటనలో వాళ్లు సత్తాచాటారు. బ్యాటింగ్‌లో పుజారా, రహానె వంటి నాణ్యమైన బ్యాట్స్‌మెన్‌ కూడా ఉండటంతో ఇరు జట్లు మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది’’ అని వకార్ పేర్కొన్నాడు. కోహ్లీ గైర్హాజరీతో పాటు రోహిత్, ఇషాంత్ జట్టుకు దూరమవ్వడం భారత్‌కు ప్రతికూలాంశమని తెలిపాడు. ‘‘రోహిత్ గొప్ప బ్యాట్స్‌మన్‌, ఇషాంత్ తన అనుభవంతో వికెట్లు సాధించగలడు. టెస్టుల్లో వాళ్లు లేకపోవడం టీమిండియాకు లోటు’’ అని వకార్‌ అన్నాడు.

పితృత్వ సెలవులపై కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టు అనంతరం అతడు స్వదేశానికి తిరిగి రానున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించని రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ కూడా తొలి రెండు టెస్టులకు దూరమవుతున్నారు. అయితే ఆస్ట్రేలియాలో కఠిన క్వారంటైన్‌ నిబంధనలు, గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుండటంతో వారిద్దరు చివరి టెస్టులకు కూడా అనుమానమే అని వార్తలు వస్తున్నాయి. కాగా, నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే శుక్రవారం జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని