రహానెకు సీక్రెట్‌ మెసేజ్‌: డీకోడ్ చేస్తారా?

ఐపీఎల్‌ అనంతరం మాజీ క్రికెటర్ వసీమ్‌ జాఫర్‌ నెట్టింట్లో ఎంతో చురుకుగా ఉంటున్నాడు. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ.....

Published : 22 Dec 2020 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌ అనంతరం మాజీ క్రికెటర్ వసీమ్‌ జాఫర్‌ నెట్టింట్లో ఎంతో చురుకుగా ఉంటున్నాడు. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ, దానికి కాస్త హాస్యం జోడిస్తూ ట్వీట్‌లు చేస్తున్నాడు. మీమ్స్‌, ఫన్నీ మాటలతో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాడు. తాజాగా అజింక్య రహానెకు జాఫర్‌ ట్విటర్‌లో ఓ రహస్య సందేశాన్ని పంపించాడు. ట్విటర్‌లో వ్యక్తిగత సందేశాలను పంపించడానికి వీళ్లేదు కదా అని ఆలోచిస్తున్నారా? అయితే రహానెను ట్యాగ్‌ చేస్తూ జాఫర్‌ అందరికి కనపడేలానే ట్వీట్‌ చేశాడు. కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరైనా కాస్త కష్టపడాల్సిందే.

‘అజింక్య రహానె.. ఇది రహస్య సందేశం. బాక్సింగ్ డే టెస్టుకు గుడ్‌ లక్‌!’ అని జాఫర్‌ పేర్కొంటూ దానికి 16 పదాలు జోడించాడు. ఈ మెసేజ్‌ను డీకోడ్ చేస్తే మీకో విషయం తెలుస్తుందని తెలిపాడు. అయితే ఆ 16 పదాల్లోని తొలి అక్షరాన్ని విడిగా రాస్తే.. ‘పిక్‌ గిల్‌ అండ్‌ రాహుల్‌’ అని వస్తుంది. డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభం కానున్న బాక్సింగ్‌ డే టెస్టుకు శుభ్‌మన్‌ గిల్, కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలని రహానెకు ఇలా పరోక్షంగా జాఫర్‌ సూచించాడు. పితృత్వ సెలవులపై కోహ్లీ భారత్‌కు తిరిగిరానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి మూడు టెస్టులకు రహానె కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. పృథ్వీ షా విఫలమవుతుండటంతో ఓపెనర్‌గా గిల్‌కు, కోహ్లీ గైర్హాజరీలో సూపర్‌ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని అందరూ అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి

36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి!

హనుమ స్థానంలో జడ్డూ..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని