ఆసీస్‌ను భయపెడతాం: కోహ్లీ

బలంగా పుంజుకుని ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను భయపెట్టేలా టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతామని భారత సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 12 పరుగుల తేడాతో...

Published : 09 Dec 2020 02:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బలంగా పుంజుకుని ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను భయపెట్టేలా టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతామని భారత సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కోహ్లీ (85; 60 బంతుల్లో, 4×4, 3×6) పోరాడాడు. అయితే చివరి టీ20లో ఓడినప్పటికీ భారత్‌ మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడాడు.

‘‘హార్దిక్‌ పాండ్య భారీ షాట్లు మొదలుపెట్టడంతో లక్ష్యాన్ని ఛేదిస్తామని భావించాం. అయితే మిడిల్‌ ఓవర్లలో మా బ్యాటింగ్‌ మ్యాచ్‌ను దూరం చేశాయి. మధ్య ఓవర్లలో 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే హార్దిక్‌కు సులువుగా ఉండేది. తిరిగి బలంగా పుంజుకుని టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ను భయపెట్టడానికి మార్గాలు అన్వేషిస్తాం. అయితే ఈ ఏడాదిని మరింత గొప్పగా ముగించడానికి టీ20 సిరీస్‌ విజయం దోహదపడుతుంది’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో సంజు శాంసన్‌ (10), శ్రేయస్ అయ్యర్ (0) ఔటవ్వడంతో టీమిండియా స్కోరువేగం నెమ్మదించింది.

‘‘ఇదే పోటీతత్వాన్ని టెస్టుల్లో కూడా కొనసాగిస్తాం. ఆసీస్‌లో ఆడిన అనుభవం మాకు ఉంది. పరుగులు సాధిస్తాం. భారీ స్కోరు సాధించాలంటే ప్రతి సెషన్‌కు ప్రణాళికతో ఆడాలి. గతంలో పర్యటించిన జట్టు కంటే ప్రస్తుత టీమ్ ఎంతో బలంగా ఉంది. అయితే సన్నాహక మ్యాచ్‌లో నేను ఆడటం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేపు నిద్ర లేచిన తర్వాత ఆడాలా వద్దా అని ఆలోచిస్తా. మా ఫిజియోతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటా’’ అని కోహ్లీ తెలిపాడు. డిసెంబర్‌ 11 నుంచి ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగే సన్నాహక మ్యాచ్‌లో టీమిండియా గులాబీ బంతితో ఆడనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభం కానున్న భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌లో.. తొలి టెస్టు డే/నైట్‌ కావడంతో గులాబి బంతి సన్నాహక మ్యాచ్‌ ఆటగాళ్లకు ఉపయోగపడుతుంది. కాగా, పితృత్వ సెలవులతో కోహ్లీ  చివరి మూడు టెస్టులకు దూరమవుతున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి

కోహ్లీ పోరాడినా..భారత్‌కు తప్పని ఓటమి

ట్విటర్‌లో విరాట్‌-అనుష్క రికార్డు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు