ఆఖరి 4 ఓవర్లు.. ఆకాశమే హద్దు

ఆఖరి నాలుగు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాలని నిర్ణయించుకున్నామని ముంబయి ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ (47*; 20 బంతుల్లో 3×4, 4×6) అన్నాడు. యువ ఆటగాడు హార్దిక్‌ పాండ్య (30*; 11 బంతుల్లో 3×4, 2×6) జోరు మీద కనిపించాడని పేర్కొన్నాడు. గత మ్యాచ్‌ ఓడిపోవడంతో గెలవాలన్న...

Updated : 02 Oct 2020 16:10 IST

హార్దిక్‌ స్వింగ్‌లో కనిపించాడన్న పొలార్డ్‌

అబుదాబి: ఆఖరి నాలుగు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగాలని నిర్ణయించుకున్నామని ముంబయి ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ (47*; 20 బంతుల్లో 3×4, 4×6) అన్నాడు. యువ ఆటగాడు హార్దిక్‌ పాండ్య (30*; 11 బంతుల్లో 3×4, 2×6) జోరు మీద కనిపించాడని పేర్కొన్నాడు. గత మ్యాచ్‌ ఓడిపోవడంతో గెలవాలన్న కసితో ఆడామని వివరించాడు. పంజాబ్‌పై ఘన విజయం తర్వాత అతడు మాట్లాడాడు.

అబుదాబి వేదికగా గురువారం రాత్రి ముంబయి, పంజాబ్‌ తలపడ్డాయి. టాస్‌ గెలిచిన రాహుల్‌ ముంబయిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే పరుగుల ఖాతా తెరవకముందే ఆ జట్టు డికాక్‌ (0; 5 బంతుల్లో) వికెట్‌ చేజార్చుకుంది. సూర్యకుమార్‌(10; 7 బంతుల్లో) సైతం త్వరగా రనౌట్‌ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ (70; 45 బంతుల్లో 7×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (28; 32 బంతుల్లో 1×4, 1×6) నెమ్మదిగా ఆడారు. దాంతో 14 ఓవర్లకు ముంబయి 87/3తో నిలిచింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్‌, పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగారు. వరుస బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో విరుచుకుపడ్డారు. ఆఖరి 4 ఓవర్లలో 89 పరుగులు సాధించారు. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన ఆఖరి ఓవర్లోనైతే ఏకంగా 25 పరుగులు చేసి పంజాబ్‌కు 192 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. బదులుగా రాహుల్‌ సేన 143/8కే పరిమితమైంది.

‘గెలిచినందుకు సంతోషంగా ఉంది. గత మ్యాచులో మేం ఓడిపోయాం. అందుకే ఈ మ్యాచులో విజయం వైపు ఉండాలని కోరుకున్నాం. మన ముందు ఎవరున్నారన్నదే ముఖ్యం. బౌలర్లను చూసి ఎన్ని పరుగులు రాబట్టాలో నిర్ణయించుకోవాలి. ఓవర్లో 15 పరుగులు కావాలంటే బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించాలి. ఈ రోజు హార్దిక్‌ జోరుమీద కనిపించాడు. అతడి బ్యాటు స్వింగ్‌ సైతం చాలా బాగుంది. ఆఖరి నాలుగు ఓవర్లలో మేం ఆకాశమే హద్దుగా చెలరేగాలని అనుకున్నాం. ఇప్పుడైతే విజయం లభించింది కానీ మున్ముందు కీలక మ్యాచులు ఆడాల్సి ఉంది’ అని పొలార్డ్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని