రైనా మళ్లీ భారత్‌కు ఆడే అవకాశం ఉందా?

టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉందా అని ఓ క్రికెట్‌ అభిమాని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా లేదన్నాడు బ్రాడ్‌హాగ్‌...

Published : 28 Jul 2020 01:34 IST

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌హాగ్‌ ఏమన్నాడో చూడండి

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉందా అని ఓ క్రికెట్‌ అభిమాని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా లేదన్నాడు బ్రాడ్‌హాగ్‌. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆటకు సంబంధించిన అనేక విషయాలపై స్పందించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఒకరు రైనా గురించి ప్రశ్నించడంతో అతడిలా అన్నాడు.

టీమ్‌ఇండియాలో ప్రస్తుత పరిస్థితుల్లో సారథి విరాట్‌ కోహ్లీ యువకులపైనే ఆసక్తి చూపుతున్నాడని, రైనా ఆడే నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పటికే మంచి ప్రదర్శన చేశాడని చెప్పాడు. అంతకన్నా కింద స్థాయిలో రైనా ఆడటం తాను చూడలేనని.. 3,4 స్థానాల్లో సరిగ్గా సరిపోయే బ్యాట్స్‌మన్‌ అని కీర్తించాడు. ఇకపై టీమ్‌ఇండియాలో అతడిని చూడలేమన్నాడు. కాగా, రైనాకున్న ఒకే ఒక్క అవకాశం టీ20ల్లో శిఖర్‌ ధావన్‌ను వదిలేసి రాహుల్‌, రోహిత్‌తో ఓపెనింగ్‌ చేయనిస్తే అప్పుడు మాత్రం చిన్న అవకాశం ఉందన్నాడు. అయితే, తాను మాత్రం అతడిని మళ్లీ టీమ్‌ఇండియాలో చూస్తాననుకోవట్లేదని స్పష్టంచేశాడు. 

ఇదే వీడియోలో అంతకుముందే ఒక అభిమాని ధోనీ గురించి అడిగాడు. బ్యాటింగ్‌, కీపింగ్‌ విషయాల్లో ఎవరైనా మాజీ సారథిని రీప్లేస్‌ చేయగలరా అని ప్రశ్నించగా బ్రాడ్‌ ఇలా స్పందించాడు. ధోనీ అద్భుతమైన ఆటగాడని, భయం లేకుండా ఆడతాడని చెప్పాడు. ఒత్తిడినంతా తనపైనే వేసుకొని ఆడతాడని తెలిపాడు. చాలా సార్లు తామే విజయం సాధిస్తామనే నమ్మకంతో ఆడతాడని వివరించాడు. కాగా, ధోనీ ఏడాదిగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌ ఆడిన అతడు తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. ఇక మార్చిలో చెన్నైలో నిర్వహించిన శిక్షణా శిబిరంలో పాల్గొని ఈసారి ఐపీఎల్‌కు సన్నద్ధమయ్యాడు. లాక్‌డౌన్‌తో మెగా టోర్నీ వాయిదా పడడంతో రాంచీలోని ఫామ్‌హౌజ్‌కు పరిమితమయ్యాడు. తాజాగా ఐపీఎల్‌పై స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఆగస్టులో అందరి కన్నా ముందే చెన్నైసూపర్‌ కింగ్స్‌ యూఏఈకి వెళ్లనున్నట్లు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని