రోహిత్ వచ్చేశాడు! మరి జట్టులో మార్పులేంటి?

బాక్సింగ్‌ డే టెస్టు విజయంతో సిరీస్‌లో టీమిండియా తిరిగి రేసులోకి వచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో ఆసీస్ ఆధిక్యాన్ని సమం చేసింది. మూడో టెస్టులోనూ సమష్టి ప్రదర్శనతో అదరగొట్టి ఆసీస్‌పై పైచేయి...

Updated : 30 Dec 2020 16:15 IST

ఇంటర్నెట్‌డెస్క్: బాక్సింగ్‌ డే టెస్టు విజయంతో సిరీస్‌లో టీమిండియా తిరిగి రేసులోకి వచ్చింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని సమం చేసింది. మూడో టెస్టులోనూ సమష్టి ప్రదర్శనతో అదరగొట్టి ఆసీస్‌‌పై ఆధిక్యం సాధించాలని రహానెసేన భావిస్తోంది. అయితే క్వారంటైన్‌ను ముగించుకుని స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ బుధవారం జట్టులో చేరాడు. దీంతో సిడ్నీ టెస్టులో భారత జట్టులో మార్పులు ఖాయమే అనిపిస్తోంది. కాగా, అతడు ఎవరి స్థానంలో జట్టులోకి వస్తాడనేదే అందరి ప్రశ్న!

సుదీర్ఘ ఫార్మాట్‌లో గొప్ప రికార్డులేమి లేని రోహిత్.. గతేడాది స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఓపెనర్‌ అవతారమెత్తాడు. శతకాలు సాధించి అన్ని ఫార్మాట్లలో సత్తాచాటగలనని చాటిచెప్పాడు. అయితే అతడు అసలు పరీక్షను ఎదుర్కోలేదు. గాయంతో న్యూజిలాండ్ పర్యటనలో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో గాయంతో ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఫిట్‌నెస్‌ను నిరూపించుకుని టెస్టు సిరీస్‌ కోసం ఇప్పుడు జట్టులోకి వచ్చాడు. ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారిలో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసి హిట్‌మ్యాన్‌కు స్థానం కల్పిస్తారనే వాదనలు వస్తున్నాయి. అంతేగాక ఆటకు చాలా రోజులు దూరమైన అతడు ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడని అంటున్నారు.

ఇదే విషయమై రెండో టెస్టు విజయానంతరం టీమిండియా కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ..‘‘రోహిత్‌తో చర్చించిన తర్వాత అతడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనేది స్పష్టత వస్తుంది. ఎందుకంటే అతడు గత కొన్ని వారాలుగా క్వారంటైన్‌లోనే ఉన్నాడు’’ అని అన్నాడు. అయితే ఓపెనర్‌గా రోహిత్ వస్తే మయాంక్‌ బెంచ్‌కే పరిమితమవుతాడు. అరంగేట్రంలోనే శుభ్‌మన్‌ గిల్ ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో అతడి స్థానం ఖరారైనట్లే. ఒకవేళ అయిదో స్థానంలో రోహిత్‌తో ఆడించాలనకుంటే విహారికి నిరాశ తప్పదు.

టీమిండియా మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా రోహిత్ జట్టులోకి వస్తే మయాంక్/విహారిలో ఒకరు తుదిట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే మయాంక్ ఎంతో ప్రతిభావంతుడని, గతంలో అతడు శతకాలు, డబుల్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తుచేశాడు. క్వారంటైన్‌ నుంచి వచ్చిన రోహిత్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగడని భావించాడు. కాగా, హిట్‌మ్యాన్‌ ఏ స్థానంలో ఆడతాడనేది జట్టు యాజమాన్యం ఆలోచనపై ఆధారపడి ఉంటుందని ఎమ్మెస్కే అన్నాడు. మరోవైపు.. మయాంక్, విహారి ఇద్దరినీ బెంచ్‌కు పరిమితం చేసి, కేఎల్‌ రాహుల్, రోహిత్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని మాజీ సెలక్టర్ దిలీప్‌ వెంగసర్కార్‌ సూచించాడు. సూపర్‌ఫామ్‌లో ఉన్న రాహుల్ తొలి రెండు టెస్టులకు ఎంపిక కాని విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా జనవరి 7నుంచి భారత్×ఆస్ట్రేలియా మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

ఇది భారత్‌.. ఎవరికీ తలవంచదు: గావస్కర్‌

కరోనా వేట.. 2020లో ఆట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని