ప్రజలకు హార్ట్‌ఎటాక్‌ తెప్పించొద్దు: ప్రీతిజింటా

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 క్రికెట్‌ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. ఉత్కంఠ భరిత మ్యాచ్‌లతో అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచుతోంది. గురువారం జరిగిన పంజాబ్‌×బెంగళూరు మ్యాచ్‌ కూడా

Updated : 17 Oct 2020 12:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 క్రికెట్‌ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. ఉత్కంఠ భరిత మ్యాచ్‌లతో అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచుతోంది. గురువారం జరిగిన పంజాబ్‌×బెంగళూరు మ్యాచ్‌ కూడా ఆఖరి బంతి వరకు కొనసాగింది. అయితే మ్యాచ్‌లో పటిష్ట స్థితిలో ఉన్న పంజాబ్‌.. గెలుపు కోసం చివరి బంతి వరకు పోరాడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే పంజాబ్‌ విజయానికి కావాల్సింది ఆఖరి 18 బంతుల్లో 11 పరుగులే. క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మెన్‌ కేఎల్ రాహుల్‌, క్రిస్ గేల్‌తో పాటు చేతిలో 9 వికెట్లు కూడా ఉన్నాయి. కానీ ఆ జట్టు ఆఖరి బంతికి విజయం సాధించింది. దీంతో తీవ్ర ఉత్కంఠతో విజయాన్ని ఆస్వాదించిన పంజాబ్‌ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా శుక్రవారం ట్వీట్ చేశారు. ఇలా తీవ్ర ఉత్కంఠకు గురిచేసి ప్రజలకు గుండెపోటు కలిగేలా మ్యాచ్‌ను ముగించకూడదని తమ జట్టును ట్విటర్‌లో సరదాగా కోరారు.

‘‘మాకు ఎంతో అవసరమైన విజయాన్ని సాధించాం. అయితే క్రికెట్‌ పేరుతో ప్రజలకు గుండెపోటు కలిగించకూడదని మా జట్టును కోరుతున్నాను. బలహీనమైన గుండె కలిగిన వాళ్లు పంజాబ్‌ మ్యాచ్‌లు చూడటానికి సిద్ధపడకూడదని హెచ్చరిస్తున్నా. ఆఖర్లో బెంగళూరు బౌలర్లు గొప్పగా పోరాడారు’’ అని ట్వీటారు. ఈ సీజన్‌లో పంజాబ్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ప్లేఆఫ్‌కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితే గెలుపు కోసం పంజాబ్‌ ఆఖరి వరకు పోరాడటం ఈ సీజన్‌లో ఇది మొదటిసారి కాదు. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆఖర్లో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను టైగా ముగించింది. అనంతరం సూపర్‌ ఓవర్‌లో ఓటమిపాలైంది. కోల్‌కతా మ్యాచ్‌లోనూ ఆఖరి బంతి వరకు పోరాడి పరాజయాన్ని చవిచూసింది. చివరి బంతికి విజయం సాధించాలంటే ఏడు పరుగులు అవసరమవ్వగా మాక్స్‌వెల్‌ ఆడిన భారీ షాట్‌..బౌండరీ లైన్‌కు కొన్ని అంగుళాల ముందు పడింది. దీంతో నాలుగు పరుగులే వచ్చి రెండు పరుగులతో మ్యాచ్‌ను కోల్పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని