
టీమ్ఇండియాకు ‘కంగారు’ పెట్టే సత్తా ఉంది
కరాచీ: ఆస్ట్రేలియాలో జరగబోయే టెస్టు సిరీసులో టీమ్ఇండియా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా అన్నాడు. ఒకప్పటితో పోలిస్తే ఆసీస్ పిచ్‌లు ప్రమాదకరంగా లేకపోవడమే ఇందుకు కారణమని వివరించాడు. బౌన్స్, స్వింగ్ తక్కువగానే కనిపిస్తోందని వెల్లడించాడు. డిసెంబర్ 17 నుంచి ఈ రెండు జట్లు బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో తలపడుతున్న సంగతి తెలిసిందే.
‘ఆస్ట్రేలియాలో కొన్నేళ్ల క్రితం నుంచి ఉపయోగించిన విధంగా ఇప్పుడు పిచ్‌లు లేవు. బౌన్స్, స్వింగ్ తక్కువగా ఉంటోంది. పిచ్‌లు మరీ ప్రమాదకరంగా, చెత్తగా ఉండటం లేదు. పైగా వ్యూయర్షిప్ గణాంకాల అవసరార్థం టీమ్ఇండియాతో అన్ని మ్యాచులను ఐదు రోజులు ఆడాలని ఆసీస్ భావిస్తోంది’ అని రమీజ్ అన్నాడు. ఈ సిరీస్ ద్వారా ప్రయోజనం పొందాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోందని ఆయన పేర్కొన్నాడు. గేట్‌మనీ లేకపోవడంతో వ్యూయర్షిప్ అత్యంత కీలకంగా మారిందని వెల్లడించాడు.
‘తొలి టెస్టు తర్వాత విరాట్ కోహ్లీ ఉండడని తెలియడంతో ఇప్పటికే ఆసీస్‌లో ఫిర్యాదులు మొదలయ్యాయి. ఏదేమైనప్పటికీ కంగారూలను ఓడించగలిగే బ్యాటింగ్ ఆర్డర్ భారత్‌కు ఉంది. పైగా టీమ్ఇండియా బౌలింగ్ ఎంతో మెరుగైంది. వారి బౌలింగ్ దాడి ఇప్పుడు భీకరంగా ఉంది. ఆసీస్ దీనిని గుర్తెరగాలి’ అని రాజా సూచించాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో రోహిత్ శర్మ లేకపోవడం కోహ్లీసేనకు లోటేనని రమీజ్ పేర్కొన్నాడు. ‘రోహిత్ మ్యాచ్ విజేత. అతడిని చూసి జట్లు భయపడతాయి. అతడు మైదానంలోకి వస్తుంటే ప్రత్యర్థి జట్లు ఆందోళన చెందుతాయి. అతడు లేకపోవడం భారత్‌కు అతిపెద్ద లోటు’ అని ఆయన తెలిపాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.