బుమ్రా.. నీ టార్గెట్‌ కనీసం 400

అసాధ్యం అనుకున్న రికార్డును ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ సుసాధ్యం చేశాడు..

Published : 27 Aug 2020 00:45 IST

పేసర్‌కు ఛాలెంజ్‌ విసిరిన యువీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసాధ్యం అనుకున్న రికార్డును ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ సుసాధ్యం చేశాడు. ప్రపంచ క్రికెట్‌ నివ్వరపోయేలా టెస్టుల్లో ఈ ఫాస్ట్‌ బౌలర్‌ 600 వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన 4వ బౌలర్‌గా నిలిచాడు. అనిల్‌ కుంబ్లే (619), షేన్‌వార్న్‌ (708), అత్యధిక వికెట్లతో ముత్తయ్య మురళీధరన్‌ (800) మాత్రమే అతడికంటే ముందున్నారు. మిగతా వారంతా స్పిన్నర్లు కాగా అండర్సన్‌ మాత్రమే ఫాస్ట్‌ బౌలర్‌. ఓ పేసర్‌‌గా ఈ ఘనత సాధించడం ఆషామాషీ విషయం కాదని, ఎంతో ఫిట్‌నెస్‌, అంకితభావం ఉంటేగానీ ఇది సాధ్యంకాదని పలువురు క్రికెటర్లు కొనియాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా అతడికి శుభాకాంక్షలు తెలిపారు. భారత పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సైతం ఈ జాబితాలో ఉన్నాడు. ‘చారిత్రక మైలురాయిని అందుకున్నందుకు శుభాకాంక్షలు జిమ్మీ.. నీ తెగువ, పట్టుదలే ఈ అసాధ్యమైన ఘనతను సాధించేలా చేశాయి. నువ్వు మరిన్ని రికార్డులు సృష్టించాలి’ అంటూ ట్వీట్‌ చేశాడు.

బుమ్రా ట్వీట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ స్పందించాడు. ఈ వైవిధ్య బౌలర్‌కి ఓ ఛాలెంజ్‌ విసిరాడు. నువ్వు కనీసం 400 వికెట్లయినా తీయాలి అంటూ బుమ్రాకు సూచించాడు. అండర్సన్‌ను కూడా యువీ మెచ్చుకున్నాడు. ‘ఓ ఫాస్ట్ బౌలర్‌ టెస్టుల్లో 600 వికెట్లు సాధిస్తాడని నా జీవితంలో అనుకోలేదు. ఎంతో నాణ్యతతో కూడిన బౌలింగ్‌ చేస్తేగానీ ఇలాంటి ఘనత సాధ్యం కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించే ఉత్తమ బౌలర్‌ జిమ్మీ’ అంటూ కొనియాడాడు. బుమ్రా ఇప్పటివరకు 14 టెస్టులు ఆడి 20.3 సగటుతో 68 వికెట్లు తీశాడు. 64 వన్డేల్లో 24.4 సగటుతో 104 వికెట్లు సాధించాడు. 50 టీ20ల్లోనూ ఆడిన బుమ్రా 59 వికెట్లు పడగొట్టాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని