కోహ్లీకి చాహల్‌ పంచింగ్‌ కామెంట్‌

ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం ఇప్పటికే అన్ని ప్రధాన జట్లూ యూఏఈకి చేరుకున్నాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కూడా శుక్రవారం అక్కడికి వెళ్లింది...

Published : 23 Aug 2020 02:37 IST

 

(ఫొటోలు: ఆర్సీబీ ట్విటర్‌ నుంచి)

దుబాయ్‌: ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం ఇప్పటికే అన్ని ప్రధాన జట్లూ యూఏఈకి చేరుకున్నాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు కూడా శుక్రవారం అక్కడికి వెళ్లింది. ఆటగాళ్లంతా ప్రత్యేక విమానంలో బయలు దేరిన ఫొటోలను ఆ జట్టు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. అయితే, అందులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కనిపించలేదంటూ అభిమానులు కామెంట్లు పెట్టారు. అలాగే కోహ్లీ వ్యక్తిగతంగా ఒక్కడే వెళ్లాడేమో అని కూడా అనుమానం వ్యక్తం చేశారు. చివరికి బెంగుళూరు కెప్టెన్‌ దుబాయ్‌లో జట్టు ఉంటున్న హోటల్‌ నుంచే ఒక ఫొటో తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ‘హలో దుబాయ్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. 

దీనికి స్పందించిన సహచర ఆటగాడు యుజువేంద్ర చాహల్‌ తనదైన శైలిలో కామెంట్‌ చేశాడు. ‘హలో మేం కూడా ఇదే హోటల్‌ నుంచి. మీ పక్కనుండే వాళ్లం’ అంటూ చమత్కరించాడు. ఇదిలా ఉండగా, శనివారం ఉదయం ఆర్సీబీకి చెందిన దక్షిణాఫ్రికా కీలక ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్‌, డేల్‌ స్టెయిన్‌, క్రిస్‌ మోరిస్‌ కూడా జట్టుతో కలిసిపోయారు. వారు నేరుగా తమ దేశం నుంచే దుబాయ్‌కు వచ్చారు. ఆ వీడియోను కూడా ఆర్సీబీ ట్విటర్‌లో పోస్టుచేసింది. అలాగే బెంగుళూరు నుంచి దుబాయ్‌కి చేరుకున్న విమాన ప్రయాణాన్ని కూడా అభిమానులతో పంచుకుంది. ఇక ఐపీఎల్‌ ప్రారంభమైన నాటి నుంచీ ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. దీంతో ఈసారైనా అది నెరవేరాలని ఆ జట్టుతో పాటు బెంగుళూరు అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని