రోహిత్‌ శర్మ‌ కెప్టెన్సీలో అదే ప్రత్యేకం.. 

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ విజయవంతమవ్వడానికి చాలా కారణాలున్నాయని, అన్నిటికన్నా ముఖ్యమైంది మాత్రం అతడు ప్రశాంతమైన వాతావరణంలో ఉండటమేనని...

Updated : 27 Aug 2020 15:45 IST

ఎంఐ డైరెక్టర్‌ జహీర్‌ఖాన్‌ ఏమన్నాడు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ విజయవంతమవ్వడానికి చాలా కారణాలున్నాయని, అన్నిటికన్నా ముఖ్యమైంది మాత్రం అతడు ప్రశాంతంగా ఉండటమేనని ఆ జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జహీర్‌ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఈ క్రమంలోనే ఒక అభిమాని రోహిత్‌ కెప్టెన్సీలో అత్యుత్తమమైన లక్షణం ఏమిటని ప్రశ్నించాడు. దానికి మాజీ పేసర్‌ స్పందిస్తూ.. ఆ లిస్టు చాలా పెద్దదని చెప్పాడు. కానీ, ఒక సారథిగా రోహిత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది మాత్రం తన చుట్టూ ఉండే పరిస్థితుల్ని ప్రశాంతంగా మల్చుకోవడమేనని బదులిచ్చాడు. అదే సమయంలో ముంబయి కెప్టెన్‌ ఆట గురించి కూడా తీవ్రంగా ఆలోచిస్తాడని తెలిపాడు. ఒత్తిడి సమయాల్లోనూ అతడు తీసుకునే నిర్ణయాలపై జట్టు సభ్యులు నమ్మకముంచుతారని వివరించాడు. 

అభిమానులు అడిగిన ప్రశ్న-జవాబులు..

* భారత్‌లోని పరిస్థితులను బట్టే ఐపీఎల్‌లో ఆటగాళ్లని తీసుకుంటారు. ఇప్పుడు వేదిక మారింది. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయి?
జహీర్‌: మీరన్నది నిజమే. ఇక్కడి పరిస్థితులను బట్టే ఆటగాళ్లను ఎంచుకుంటారు. అయితే, సహజంగా జట్లు అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ఆటగాళ్లనే ఎంపిక చేస్తాయి. ఇక ముంబయి ఇండియన్స్‌ విషయానికి వస్తే.. అన్ని కోణాల్లో ఆలోచించే ఆటగాళ్లను ఎంపిక చేశాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడే ఆటగాళ్లు మాకున్నారు. అయితే, అక్కడి పరిస్థితుల్ని త్వరగా అర్థం చేసుకోవాలి.

* ఇన్ని పకడ్బందీ చర్యలు తీసుకొని ఆడటం కష్టం అనిపించదా?
జహీర్‌: ఇది కష్టతరంగా ఉండదు కానీ, ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు ఆటగాళ్లు తీసుకొనే జాగ్రత్తలతో వారి వ్యవహార శైలిలో మార్పులు వస్తాయని అనుకుంటున్నా. అయితే, అదంతా కాలం పై ఆధారపడింది. ఎంత త్వరగా అలావాటు చేసుకుంటారనేదే ముఖ్యం. ఒక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా ఇలాంటి అవాంతరాలను ఎదుర్కోవాలి. ఇది కష్ట కాలమని భావిస్తున్నా. 

* ముంబయి ఇండియన్స్‌కు ఈసారి ట్రెంట్‌బౌల్ట్‌ను తీసుకొచ్చారు. అతడిపై మీ అభిప్రాయం?
జహీర్‌: ఈసారి బౌల్ట్‌ను తీసుకొచ్చాం. అతడో అద్భుతమైన బౌలర్‌. ప్రపంచ స్థాయి పేసర్‌. అతడి రికార్డు కూడా అమోఘంగా ఉంది. అతడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. ఆదిలోనే వికెట్లు తీసిచ్చి మా జట్టుకు లాభం చేకూరుస్తాడని విశ్వసిస్తున్నాం. 

* ఇప్పుడక్కడ జట్టు ఎలా సన్నద్ధమవుతోంది?
జహీర్‌: ఇక్కడ అన్నీ బాగానే సాగుతున్నాయి. సాధన కూడా చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఉన్నారు. బరిలోకి మళ్లీ టైటిల్‌ను కాపాడుకోవాలని అనుకుంటున్నారు. మేమంతా తొలి మ్యాచ్‌ కోసం ఎంతో ఎదురుచూస్తున్నాం. ఇప్పుడైతే అన్ని ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి. 

* ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్‌ ఆడటం ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది?
జహీర్‌: ఇప్పుడున్న కఠిన పరిస్థితుల్లో ఆడటమనేది నిజంగా కష్టతరమే. పల్టాన్స్‌ అభిమానులెప్పుడూ మద్దతు తెలుపుతూనే ఉంటారు. వారందరికీ ధన్యవాదాలు.

* గతంలో ఇక్కడ ఆడినప్పుడు ముంబయి ఇండియన్స్‌ ఆదిలో తడబడింది. ఈ విషయాలు మీకు గుర్తున్నాయా?
జహీర్‌: గతంలో ఇక్కడ ఆడిన అనుభవాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అది నిజమే, యూఏఈలో ఇది వరకు ఆడినప్పుడు కొన్ని ఓటములు చవిచూశాం. కానీ, మేం దాన్ని సవాలుగా స్వీకరించి ముందుకెళ్లాం. ఏ జట్టుకైనా ఇటువంటి పరిస్థితులు మంచి చేస్తాయి. కాబట్టి, ఇప్పుడు కూడా అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. గత రికార్డును తిరగ రాస్తామనే నమ్మకం ఉంది. 

* ముంబయి ఇండియన్స్‌లో చిలిపి ఆటగాడెవరు?
జహీర్‌: మా జట్టులో అలాంటి ఆటగాడంటే ఇషాన్‌ కిషన్‌. అతనెప్పుడూ సరదాగా ఉంటూ ప్రాంక్స్‌ చేస్తుంటాడు. అలాంటి వాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉంటే మంచిదే. 

* జహీర్‌ ఈసారి నెట్స్‌లో బౌలింగ్‌ చేయడం మేం చూస్తామా?
జహీర్‌: అది అభిమానుల డిమాండ్‌ మేరకే. నేను నెట్స్‌లో బౌలింగ్‌ చేయడం మీరు చూడాలంటే మీరు గట్టిగా అరిచి మద్దతు తెలపాలి. మీరు అలాంటి మద్దతిస్తే నేను నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తా.

* జహీర్‌ కొత్త బంతి బౌలరా, పాత బంతి బౌలరా? ఏది.. ఎందుకు?
జహీర్‌: నేను పాత బంతి బౌలరే. కారణం ఏంటంటే కొత్త బంతి చాలాసేపు ఉండదు. నేను ఎక్కువ కాలం బౌలింగ్‌ చేసింది పాత బంతితోనే. కాబట్టి పాత బంతి బౌలర్‌నే.

* ఈసారి ముంబయి నుంచి ఎవరైనా కొత్త టాలెంట్‌ను ఆశించవచ్చా?
జహీర్‌: యంగ్‌స్టర్స్‌ను సపోర్ట్‌ చేసే సాంప్రదాయం మేం పాటిస్తాం. కాబట్టి, ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది. ఈసారి మా జట్టులో కొత్తగా వచ్చినవారు ఉన్నారు. వాళ్ల మీద కన్నేసి చూస్తాం. వాళ్లు అవకాశాల కోసం వేచి చూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు