
T20 world cup: ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రింక్‌ను తాగడానికి బూట్లు ఎందుకు వాడారు..?
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
టీ20 ప్రపంచకప్‌ను తొలిసారి అందుకొన్న వెంటనే ఆసీస్ ఆటగాళ్ల ఆనందానికి అంతే లేకుండాపోయింది. వెంటనే విజయోత్సవాల్లో భాగంగా తమ బూట్లను విడిచి వాటిల్లో డ్రింక్స్ పోసుకోని తాగారు. క్రికెట్ అభిమానులు ఈ చేష్టలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. వాళ్లేం చేస్తున్నారో అర్థం కాలేదు. చక్కగా డ్రింక్‌ను క్యాన్‌లో తాగకుండా కాళ్లకు వేసుకొన్న బూట్లలో పోసుకొని తాగటమేంటి? అని ఆశ్చర్యపోయారు. వాస్తవానికి వారు ఆస్ట్రేలియాకు చెందిన పాత ఆచారాన్ని క్రికెట్ అభిమానులకు పరిచయం చేశారు. ఈ రకంగా సంబరాలు చేసుకోవడాన్ని ‘షూయి’ అంటారు.
ఈ రకంగా బూట్లలో బీర్‌ను పోసుకొని తాగి సెలబ్రేట్ చేసుకొనే ఆచారం 18వ శతాబ్ధంలో జర్మనీలో మొదలైందని చెబుతారు. భారీగా అదృష్టం కలిసి వచ్చినప్పుడు, సంబరాలకు చిహ్నం, లేదా శిక్షగా భావించేవారు. ఈ ఆచారం ఆస్ట్రేలియాలో బాగా పాపులర్ అయింది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియన్ రైడర్ జాక్ మిల్లర్, ఫార్ములా వన్ డ్రైవర్ డేనియల్ రెకిర్డోలు ‘షూయి’లను పోడియం మీదే చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత తరచూ చాలా మంది క్రీడాకారులు దీనిని కొనసాగిస్తున్నారు.
* రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైనికులు కూడా దాడికి ముందు.. విజయానికి తర్వాత తమ జనరల్ బూట్‌లో బీర్ పోసుకొని తాగేవారు. ఇది అదృష్టంగా వారు భావించేవారు.
వ్యాధి కారకాలకు పుట్టిల్లు బూట్లే..
బ్యాక్టీరియా, ఇతర పరాన్న జీవులకు బూట్లు ఆవాసాలు. అటువంటి బూట్లలో ఆల్కహాల్‌ను పోసుకొని తాగడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. సంబరాలు చేసుకోవడానికి ఇటువంటి పద్ధతిని వినియోగించడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ పత్రిక దీనిపై హెచ్చరిస్తూ ఓ కథనం వెలువరించింది. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ దీనిపై పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. సాధారణంగా చాలా బూట్లలో హాని రహిత బ్యాక్టీరియా ఉంటుందని తేలింది. వీటిల్లో ఆల్కహాల్ పోసి 60 క్షణాలు ఉంచి తిరిగి పరీక్షించారు. దీనిలో స్టాఫలోకాకస్ అనే బ్యాక్టీరియా ఆనవాళ్లు ఇంకా ఉన్నట్లు గుర్తించారు. ఇది కడుపులోకి వెళ్తే సెప్టిసిమియా, నిమోనియా, వాంతులు, ఆహారం విషపూరితం కావడం వంటి దుష్ప్రాభావాలను గుర్తించారు. దీనికి క్రీడాకారుడు వాటిల్లో డ్రింక్స్ పోసుకొని వెంటనే తాగడంతో ఆ బ్యాక్టీరియా సజీవంగా కడుపులోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.