MS Dhoni: వీరాభిమానం.. ధోనీని కలిసేందుకు 1400 కి.మీ. కాలినడక

ఓ అభిమాని సాహసమే చేశాడు. తన ఫేవరేట్‌ను కలిసేందుకు ఏకంగా 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాడు. హరియాణాలోని తన గ్రామం నుంచి నడక ప్రారంభించిన అజయ్‌ గిల్‌ (18) అనే అభిమాని 1400 కి.మీ. నడిచి....

Published : 16 Aug 2021 01:51 IST

రాంచీ: భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్‌లో మిస్టర్‌ కూల్‌ క్రేజ్‌ అంతాఇంతా కాదు. ధోనీపై అభిమానులు తమ అభిమానాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని సాహసమే చేశాడు. తన ఫేవరేట్‌ను కలిసేందుకు ఏకంగా 1400 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాడు. హరియాణాలోని తన గ్రామం నుంచి నడక ప్రారంభించిన అజయ్‌ గిల్‌ (18) అనే అభిమాని 1400 కి.మీ. నడిచి ఝార్ఖండ్‌లోని రాంచీకి చేరుకున్నాడు. జులై 29న పయనమైన అజయ్‌ 17 రోజుల పాటు నడిచి ధోనీ స్వస్థలమైన రాంచీకి చేరుకున్నాడు.

ఇంత సాహసం చేసినా.. ఆ యువకుడికి నిరాశే ఎదురైంది. గిల్‌ రాంచీకి చేరుకునే రెండు రోజుల ముందే ఐపీఎల్‌ కోసం ధోనీ దుబాయ్‌కి పయనమయ్యాడు. అయినప్పటికీ తన ఫేవరేట్‌ తిరిగొచ్చేవరకు ఇక్కడే ఎదురుచూస్తానని ఈ యువకుడు పేర్కొన్నాడు. మహీని కలిసిన తర్వాతే తిరిగి వెళతానని చెప్పాడు. ‘ఇంతదూరం కాలినడకన వచ్చినందుకు ధోనీ నాతో 10 నిమిషాలైనా మాట్లాడతాడు’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు అజయ్‌.

తన స్వగ్రామంలోని ఓ సెలూన్‌లో పనిచేసే అజయ్‌ చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. జుట్టుకు పసుపు, ఆరెంజ్‌, నీలం రంగులు వేసుకొని.. తలకు రెండు వైపులా ధోనీ, మహీ అనే పేర్లతో దర్శనమిస్తున్నాడు. ధోనీని కలిసేందుకు నడుచుకుంటూ వెళుతున్నాననే విషయం తెలుసుకున్న సోనేపత్‌లోని ఓ బార్బర్‌ తనను ఇలా తయారుచేసినట్లు అజయ్‌ తెలిపాడు. క్రికెటర్‌ కావాలని కలలు కన్నానని.. కానీ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత క్రికెట్‌ ఆడటం మానేశానని గిల్‌ తెలిపాడు. మహీ ఆశీర్వాదంతోనే మళ్లీ క్రికెట్‌ ఆడాలని భావిస్తున్నట్లు వివరించాడు.

అజయ్‌ గురించి తెలుసుకున్న అనురాజ్‌ చావ్లా అనే వ్యక్తి.. యువకుడిని ఓ హోటల్‌ రూంకి తీసుకెళ్లారు. ధోనీ వచ్చేందుకు ఇంకా చాలారోజులు పట్టనుండటంతో ఇంటికి వెళ్లాలని అతడికి సూచించారు. కాలినడకన వచ్చినందుకు అతడికి దిల్లీ వరకు విమాన టికెట్‌ను అందించారు. మహీ వచ్చాక మళ్లీ రావాలని అజయ్‌కి సూచించినట్లు అనురాగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని