IPL 2022 : ఐపీఎల్‌ 15వ సీజన్‌... తొలి మ్యాచ్‌ వీరి మధ్యేనా?

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌ ఎప్పుడో...

Published : 28 Feb 2022 01:08 IST

25 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఉంటుందన్న బీసీసీఐ వర్గాలు

ఇంటర్నెట్ డెస్క్: టాటా ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 15వ సీజన్‌ ఎప్పుడో తెలిసిపోయింది. పది జట్లు పాల్గొనే ఐపీఎల్ 2022 సీజన్‌లో మ్యాచ్‌ల ఫార్మాట్‌ తెలిసింది. షెడ్యూల్‌తోపాటు తొలి మ్యాచ్‌ ఎవరెవరి మధ్య జరగనుంది.. వేదిక ఎక్కడనేది మాత్రమే అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం గత సీజన్‌లో ఫైనల్‌కు చేరిన జట్ల మధ్యే ఈసారి మొదటి మ్యాచ్ ఉండనుంది. 

మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ మే 29న ముగియనుంది.  కొత్తగా చేరిన రెండు ఫ్రాంచైజీలతో కలిపి మొత్తం పది జట్లు 15వ సీజన్‌లో పాల్గొంటాయి. రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్‌తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి. గత సీజన్‌ ఫైనలిస్ట్‌లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్‌ ఉంటుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్ ట్రోఫీని ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే గెలుచుకున్న విషయం తెలిసిందే.

‘‘అవును. సీఎస్‌కే, కేకేఆర్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ 15వ సీజన్‌ పోటీలు ప్రారంభమవుతాయి. అన్ని జట్ల సభ్యులను తరలించేందుకు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. దీని వల్ల హోటల్‌ గది నుంచి స్టేడియం వరకు ఉండే ట్రాఫిక్‌ జామ్‌ వంటి సమస్యలను తప్పించుకోవచ్చు. అలానే 25 శాతం ప్రేక్షకులను అనుమతిచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది’’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని