T20 World Cup: పాక్‌పై గేమ్ ‘A’ అమలు చేస్తామంటున్న విరాట్ కోహ్లీ

ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్‌ సమరం

Published : 24 Oct 2021 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఆదివారం తలపడబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు వేయికళ్లతో ఈ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.  ఇప్పటి వరకు ప్రపంచకప్‌ పోటీల్లో పైచేయి సాధించిన టీమిండియా తన ఆధిపత్యం కొనసాగిస్తుందా? లేదా పాక్‌ పుంజుకుని రికార్డును తిరగరాస్తుందా అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్నలు. ఈ క్రమంలో భారత్‌, పాక్‌ సారథులు విరాట్‌ కోహ్లీ, బాబర్ అజామ్‌ ఈ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకోరనేది కాదనలేని సత్యం. పాకిస్థాన్ జట్టులో ఆటను తమవైపు మలుపు తిప్పేవారు చాలా మంది ఉన్నారు. కాబట్టి పాక్‌ మీద గెలిచి గ్రూప్‌లో ముందంజ  వేయాలంటే టీమిండియా అత్యుత్తమ గేమ్‌ను ఆడాల్సిందేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. 

ఆటగాళ్లతో ప్రి-మ్యాచ్‌ కాన్ఫరెన్స్‌లోనూ భారత సారథి విరాట్ కోహ్లీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘పాక్‌ బలమైన జట్టు. కాబట్టి వారితో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఉత్తమ ఆటతీరును ప్రదర్శించండి. పాక్‌ టీంలో గేమ్‌ ఛేంజర్లు చాలామంది ఉన్నారు. అందుకే పాక్‌తో అత్యుత్తమ ‘ఏ’ గేమ్‌ను ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని పేర్కొన్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌పై టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తుది జట్టులో చోటు దక్కడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ పాండ్య పరిస్థితిపై కోహ్లీ స్పందిస్తూ.. ‘‘హార్దిక్ ఫిట్‌నెస్‌ గాడినపడుతోంది. బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమవుతూనే ఉన్నాడు. అలాగే మా బ్యాటింగ్‌, బౌలింగ్‌ కాంబినేషన్‌పై చర్చించాం. అయితే ఆ వివరాలు ఇప్పుడే చెప్పకూడదు. మైదానంలో తమ ఆలోచనలను సరిగ్గా అమలుపరుస్తామనే నమ్మకంగా ఉన్నాం. కనీసం రెండు ఓవర్లపాటు బౌలింగ్‌ చేసేందుకు హార్దిక్‌ సిద్ధమయ్యే వరకు వేచి చూస్తాం. అప్పటి వరకు మాకు కొన్ని ఆప్షన్లు ఉన్నాయి’’ అని కోహ్లీ తెలిపాడు. రవిశాస్త్రి-విరాట్ కోహ్లీ కాంబినేషన్‌.. ఎంఎస్ ధోనీ మార్గదర్శకత్వంలో టీమిండియా ప్రపంచకప్‌ను నెగ్గాలని ప్రతి అభిమానీ ఆకాంక్షిస్తున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని