INDvsENG: పుజారాపై ఆ వార్తలు నమ్మను: చోప్రా

రాబోయే ఇంగ్లాండ్‌ సిరీస్‌లో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారాను టీమ్‌ఇండియా పక్కన పెడుతుందనే వార్తలను నమ్మనని మాజీ ఓపెనర్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు....

Published : 17 Jul 2021 01:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాబోయే ఇంగ్లాండ్‌ సిరీస్‌లో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పుజారాను టీమ్‌ఇండియా పక్కన పెడుతుందనే వార్తలను నమ్మనని మాజీ ఓపెనర్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఇటీవల ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పుజారా రాణించలేని సంగతి తెలిసిందే. అలాగే ఇంగ్లాండ్‌లోనూ అతడి సగటు చెప్పుకోదగ్గ రీతిలో లేదు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా అతడిని ఆడించదని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌లో ఆ విషయంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆకాశ్‌ చోప్రా ఇలా సమాధానమిచ్చాడు.

గత ఇంగ్లాండ్‌ పర్యటనలో ఈ టీమ్‌ఇండియా స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ శతకం బాదాడని చోప్రా గుర్తుచేశాడు. ‘పుజారాను ఆడించరనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, నేను వాటిని నమ్మను. ఎందుకంటే టీమ్‌ఇండియా ఇదివరకు ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు అతడు శతకం బాదాడు. మరోవైపు ఇంగ్లాండ్‌లో అతడి సగటు 30 కన్నా తక్కువుగా ఉందని మీరు ఆలోచిస్తున్నారని కూడా తెలుసు. అలాగే కివీస్‌తో ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ రాణించలేదని తెలుసు. పుజారా చాలా నెమ్మదిగా ఆడటం వల్ల స్కోరుబోర్డు ముందుకు కదలదని అనిపిస్తుంది. అది అతడి బ్యాటింగ్‌ స్టైల్‌. తనకిష్టమొచ్చినట్లు ఆడతాడు. అలా ఆడటం వల్ల జట్టు కూడా చాలాసార్లు లాభపడింది’ అని చోప్రా వివరించాడు.

‘పుజారా కచ్చితంగా జట్టులో ఉంటాడని నేను నమ్ముతున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ఇండియా అతడిని తొలగించదు. కచ్చితంగా తుది జట్టులో అట్టిపెట్టుకుంటుంది. ఈ పర్యటనలో అతడి సగటు కూడా మెరుగవుతుందని ఆశిస్తున్నా. గత రెండేళ్ల ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో అతడు అన్ని మ్యాచ్‌లూ ఆడాడు. కొన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్‌ కూడా ఆడాడు. అయితే, వాటిలో భారీ స్కోర్లు రాలేదంతే’ అని మాజీ ఓపెనర్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇదిలా ఉండగా, పుజారా 2019లో సిడ్నీ టెస్టులో చివరిసారి శతకం బాదాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా 18 టెస్టులు ఆడినా మరో శతకం సాధించలేదు. ఈ క్రమంలోనే ఆయా టెస్టుల్లో మొత్తం 841 పరుగులు చేశాడు. అందులో అతడి సగటు 28.03గా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని