INDvsSL: అలా చేస్తే ధావన్‌, ద్రవిడ్‌కు తలనొప్పే!

వచ్చేనెలలో టీమ్‌ఇండియా శ్రీలంక పర్యటన ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ రెండు రోజుల క్రితం 20 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆరుగురు స్పిన్‌ బౌలర్లను ఎంపిక చేయడం గమనార్హం...

Published : 13 Jun 2021 01:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే నెలలో టీమ్‌ఇండియా శ్రీలంక పర్యటన ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ రెండు రోజుల క్రితం 20 మంది ఆటగాళ్ల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో ఆరుగురు స్పిన్‌ బౌలర్లను ఎంపిక చేయడం గమనార్హం. జులై 13, 16, 18 తేదీల్లో మూడు వన్డేలు ఆడనుండగా.. 21, 23, 25 తేదీల్లో మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా మ్యాచ్‌ల్లో ఆరుగురు స్పిన్నర్లను ఎలా ఆడిస్తారని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా సందేహం వెలిబుచ్చాడు. అది కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉందన్నాడు.

‘ఈ పర్యటనలో ఆరుగురు స్పిన్నర్లు, నలుగురు ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. ఇందులో స్పిన్నర్లను ఎవరు ఎంపిక చేస్తారు? వీరిలో ఎవరిని.. ఎప్పుడు.. ఎలా ఆడించాలనే విషయాలపై కెప్టెన్‌, కోచ్‌కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. రాహుల్‌ చాహర్‌, యుజువేంద్ర చాహల్‌, వరుణ్‌ చక్రవర్తి, కృనాల్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, కృష్ణప్ప గౌతమ్‌ను తీసుకున్నారు. అయితే, ముగ్గురు స్పిన్నర్ల కన్నా ఎక్కువ ఏ మ్యాచ్‌లోనూ ఆడించే అవకాశం ఉండదు. కొన్నిసార్లు ముగ్గురు స్పిన్నర్లను ఆడించడం కూడా కష్టమవుతుంది. సహజంగా ముగ్గురు ఫాస్ట్‌ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారు. ఇక ఇందులో కృనాల్‌ పాండ్య కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. ఎందుకంటే అతడి తర్వాత ఫినిషర్లు లేరు. దాంతో మరో ఇద్దరు స్పిన్నర్లకే అవకాశం ఉంటుంది’ అని మాజీ క్రికెటర్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.

అలాగే యుజువేంద్ర చాహల్‌ను వన్డేల్లో కచ్చితంగా ఆడిస్తారని, దాంతో ఆ సిరీస్‌లో గరిష్టంగా ఇంకో స్పిన్నర్‌కు మాత్రమే అవకాశం ఉంటుందని ఆకాశ్‌ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక్కడ రెండో స్పిన్నర్‌గా కుల్‌దీప్‌కు అవకాశమివ్వాలని చెప్పాడు. ఎందుకంటే అతడిని టీ20ల్లో ఆడించే అవకాశం లేదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ చాహర్‌, కృష్ణప్ప గౌతమ్‌ను ఎందుకు ఎంపిక చేశారని మాజీ బ్యాట్స్‌మన్‌ సందేహం వెలిబుచ్చాడు. కాగా, టీమ్‌ఇండియా ఈ పర్యటనలో వివిధ స్పిన్‌ బౌలింగ్‌ జోడీలను ప్రయత్నించాలనే ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చాహల్‌, కుల్‌దీప్‌ను వన్డేల్లో.. వరుణ్‌ చక్రవర్తి, రాహుల్‌ చాహర్‌ను టీ20ల్లో ఆడించే అవకాశం ఉంది. కృనాల్‌కు తుది జట్టులో ఉండే అవకాశం ఉండటంతో కృష్ణప్పని అదనపు ఆటగాడిగా ఎంపిక చేశారని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని