Gautam Gambhir: గంభీర్‌ ఆగమనం.. ఆ ఆటగాళ్లకు హెచ్చరికే: మాజీ క్రికెటర్‌

టీమ్‌ ఇండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ ఎంపిక కావడం దాదాపు లాంఛనమే. ఈ నేపథ్యంలో సీనియర్‌ ఆటగాళ్ల విషయంలో ఆకాశ్‌ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 20 Jun 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా కొత్త హెడ్‌ కోచ్‌గా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. రెండో రౌండ్‌ ఇంటర్వ్యూ అనంతరం అతడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వ్యాఖ్యాత, టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌ ఆగమనం.. జట్టులో సీనియర్‌ ఆటగాళ్లకు హెచ్చరికలాంటిదని పేర్కొన్నాడు.

‘‘గంభీర్‌ వర్చువల్‌ ఇంటర్వ్యూను నేను విన్నాను. ఈ రేసులో అతడు ముందున్నాడు. కోచ్‌గా అతడి పదవీకాలం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జట్టులో ఎంతో మార్పు తీసుకురావాల్సి ఉంటుంది. అయితే.. అది అంత సులభం కాదు.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, షమీ, రవీంద్ర జడేజా, అశ్విన్‌లాంటి 30 ఏళ్లకు పైబడిన ఆటగాళ్లు టీమ్‌లో ఉన్నారు’’ అని చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్‌లో అభిప్రాయపడ్డాడు.

‘కోచ్‌గా నియమితులైతే గంభీర్‌ కాంట్రాక్ట్‌ 2027 వన్డే ప్రపంచకప్‌ వరకూ కొనసాగే అవకాశం ఉంది. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2027లోనే ఉంది. 2026లో టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఇందు కోసం జట్టును సిద్ధం చేయాలి. అప్పటికి ఇప్పుడున్న స్టార్‌ ఆటగాళ్ల వయసు 40కి దగ్గర్లోకి చేరుతుంది. భవిష్యత్‌ రోడ్‌మ్యాప్‌ కోసం పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అని చోప్రా పేర్కొన్నాడు.

‘జట్టులో మార్పులు తీసుకువస్తున్నప్పుడు ఆటగాళ్ల ప్రదర్శనలు తగ్గకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఆటగాళ్లతో సరిగ్గా కమ్యూనికేట్‌ చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఏ ఆటగాళ్లను ఉంచుకుంటారు.. ఎవరిని పంపిస్తారనే విషయంలో వారికి సరైన కారణాలు వివరించాలి’’ అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని