అది తప్ప శ్రేయస్‌కు మరో దారి లేదు: చోప్రా

దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టీమ్‌ఇండియాలో ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడాలని, అది తప్ప వేరే దారి లేదని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు...

Published : 21 Mar 2021 01:56 IST

                                                                                              (Photo: Aakash Chopra Facebook)

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టీమ్‌ఇండియాలో ఎక్కడ ఆడమంటే అక్కడ ఆడాలని, అది తప్ప వేరే దారి లేదని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌చోప్రా అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడిన చోప్రా..  శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై స్పందించాడు. ‘టీమ్‌ఇండియా చెప్పినట్లే ఆడాలి. అతడికి వేరే మార్గం లేదు. నీళ్లలో పడిన వాడికి ఈదడం లేదా మునగడం తప్ప వేరే దారి లేదంటారు కదా. అలాగే శ్రేయస్‌ కూడా ఏ స్థానంలో ఆడమంటే ఆ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలి’ అని పేర్కొన్నాడు.

అయితే, నాలుగో టీ20లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన శ్రేయస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగానే రావాలని చోప్రా చెప్పుకొచ్చాడు. ‘అతడు ఆరోస్థానంలో ఆడటం కచ్చితంగా సరికాదు. తొలి టీ20లో టీమ్ఇండియా 124 పరుగులు సాధిస్తే.. శ్రేయస్‌ ఒక్కడే 67 పరుగులు చేశాడు. జట్టు స్కోరులో సగం పరుగులు అతడివే. అలాంటి ఆటగాడిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పైకి పంపకుండా మరింత దిగువకు పంపుతున్నారు. ఇంతకుముందు ఐదు, ఇప్పుడు ఆరో స్థానంలో వచ్చాడు. అది అతడికి సరైన స్థానం కాదు. అతడెంతో చక్కగా ఆడుతున్నాడు. ఇప్పుడు ఆడించే స్థానం అతడికి పూర్తిస్థాయిలో పరిమితం కాదు’ అని చోప్రా వివరించాడు. అయితే, టీమ్ఇండియా టాప్ఆర్డర్‌ బలంగా ఉందని, దాంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి సైతం తన మూడో స్థానంలో ఆడే అవకాశం లేకపోయిందన్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రేయస్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడని మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని