Aaron Finch: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్‌ టీ20 కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌ గుడ్‌బై!

ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ (Aaron Finch) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేశాడు. ఆస్ట్రేలియాకు (Australia) తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను అందించిన సారథిగా ఘనత సాధించాడు.

Published : 07 Feb 2023 10:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ (Aaron Finch) కీలక నిర్ణయం తీసుకొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. గతేడాది సెప్టెంబర్‌లోనే వన్డే కెరీర్‌కు ముగింపు  పలికిన ఫించ్‌.. ఇప్పుడు కేవలం టీ20లకే  ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ను (T20 World Cup 2022) గెలుచుకోవడంలో విఫలం కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫామ్‌పరంగానూ గొప్పగా లేకపోవడంతో వీడ్కోలు చెప్పాడు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశాడు. 

‘‘టీ20 ప్రపంచ కప్‌ 2024 వరకు నేను ఆడటం కష్టమే. అందుకే  ఆసీస్‌ జట్టు సారథిగా దిగిపోతున్నా. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నా. ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. వచ్చే ఏడాది మెగా టోర్నీ నాటికి జట్టును సమాయత్తం చేసేందుకు తగినంత వ్యవధి ఉంటుంది. అంతర్జాతీయ కెరీర్‌లో విజయవంతం కావడానికి సహకరించిన, మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ 2021, 2015లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ను అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేనివి. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు 12 ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా ఉంది. దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడటం గౌరవంగా భావిస్తున్నా’’ అని ఫించ్‌ వెల్లడించాడు. 

వన్డే ప్రపంచకప్‌లను నెగ్గి దిగ్గజ జట్టుగా మారిన ఆస్ట్రేలియాకు పొట్టి కప్‌ను సొంతం చేసుకోవాలనే కలను కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్‌ తీర్చాడు. అతడి నాయకత్వంలోనే యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2021 టోర్నీ టైటిల్‌ను ఆసీస్‌ ఎగరేసుకొని పోయింది. ఆసీస్‌ తరఫున కేవలం ఐదు టెస్టులను మాత్రమే ఆడిన ఫించ్‌ 278 పరుగులు సాధించాడు. 146 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించిన ఫించ్‌ 146 మ్యాచుల్లో 17 శతకాలు, 30 అర్ధశతకాలతో 5,406 పరుగులు చేశాడు. 103 టీ20ల్లో రెండు సెంచరీలు, 19 అర్ధశతకాలతో 3,120 పరుగులు సాధించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని