Virat Kohli : విరాట్ ఎప్పటికీ వరల్డ్‌ క్లాస్‌ ఆటగాడే.. ఫామ్‌ కోల్పోవడం తాత్కాలికం..!

ఆసియా కప్‌ సమీపిస్తోంది.. ఇంకో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ఉంది. అయితే టీమ్‌ఇండియాలో ఎక్కువగా చర్చ మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫామ్‌పైనే సాగుతోంది. విరామం తీసుకుని...

Published : 23 Aug 2022 01:49 IST

దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ సమీపిస్తోంది.. ఇంకో రెండు నెలల్లో టీ20 ప్రపంచకప్‌ ఉంది. అయితే టీమ్‌ఇండియాలో ఎక్కువగా చర్చ మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఫామ్‌పైనే సాగుతోంది. విరామం తీసుకుని ఆసియా కప్‌ బరిలోకి దిగుతున్న విరాట్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో విరాట్ ఫామ్‌ గురించి ఎలాంటి ఆందోళన వద్దని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ అంటున్నాడు. కోహ్లీతో కలిసి ఏబీడీ భారత టీ20 లీగ్‌లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. కోహ్లీ ఫామ్, టీ20 క్రికెట్‌ లీగ్‌ల ప్రభావం వంటి విషయాలను ఏబీడీ ఓ క్రీడా ఛానెల్‌తో ముచ్చటించాడు. 

‘‘అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఫామ్‌ కోల్పోవడం తాత్కాలికం. క్లాస్‌ ఆట శాశ్వతం. విరాట్ ప్రపంచ స్థాయి క్లాస్‌ ఆటగాడు. విరాట్‌తో రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉంటా. మేమిద్దరం స్నేహితులం. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అతడికి నా అవసరం ఏమీ లేదు. తప్పకుండా ఫామ్‌ అందుకుంటాడు. ఇక టీ20 క్రికెట్‌ లీగ్‌లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇతర ఫార్మాట్లపై ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయా ఫార్మాట్లకు తగినంత సమయం కేటాయింపు జరుగుతుంది. ఆదాయం సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టీ20 ఫార్మాట్‌ను వృద్ధి చేయడంలో అంతర్జాతీయంగా ఫ్రాంచైజీలు కీలక పాత్ర పోషిస్తాయి’’ అని ఏబీడీ వివరించాడు. 

ఇటీవల సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆసీస్‌ మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ తనతో పోల్చడంపైనా డివిలియర్స్‌ స్పందించాడు. ‘‘సూర్యకుమార్‌ చాలా బాగా ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్‌ చూస్తూ ఎంజాయ్‌ చేశా. ప్రతి ఆటగాడు నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. భారత టీ20 లీగ్‌లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ గౌరవంగానే భావిస్తా. ఇప్పటికీ ఫ్రాంచైజీతో అనుబంధం ఉంది. వచ్చే సీజన్‌కు సంబంధించి బెంగళూరు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో ఉండటం గొప్ప గౌరవం’’ అని ఏబీడీ తెలిపాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా కూడా గట్టి పోటీ ఇస్తుందని డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని