Virat Kohli: వరల్డ్‌ కప్‌ ముగిసిన తర్వాత.. విరాట్ ఇలా చెబుతాడేమో: ఏబీ డివిలియర్స్‌

ఇప్పుడందరి దృష్టి అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌ కప్‌పైనే (ODI World Cup 2023) ఉంది. ఒక్కసారి మెగా సమరం ముగిశాక కీలక ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవుతారనే చర్చ కొనసాగుతోంది.

Published : 26 Sep 2023 17:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) టీమ్‌ఇండియాకు విరాట్ కోహ్లీ కీలకం అనడంలో సందేహం లేదు. ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. అదే ఊపును మెగాటోర్నీలో కొనసాగించి భారత్‌కు మరో ట్రోఫీని అందించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. వరల్డ్‌ కప్ ముగిశాక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడనే వాదనా మరోవైపు ఉంది. దీనిపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తు గురించి కోహ్లీ (Virat Kohli) ఎక్కువగా ఆలోచించడని.. ప్రస్తుతం అతడి దృష్టంతా వన్డే ప్రపంచకప్‌పైనే ఉందని వివరించాడు. అయితే.. టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ గెలిస్తే.. వన్డే ఫార్మాట్‌కు అతడు వీడ్కోలు పలికే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాడు.

‘‘కోహ్లీ ప్రపంచకప్‌ 2027 కోసం దక్షిణాఫ్రికాకు (వరల్డ్‌ కప్‌కు వేదిక) రావడానికి ఇష్టపడతాడని తెలుసు. కానీ.. అలా జరుగుతుందని చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే దానికి చాలా సమయం ఉంది. అయితే.. ఈ ప్రపంచకప్‌ భారత్‌ గెలిచిన తర్వాత విరాట్‌ ఇలా చెబుతాడని నేను అనుకుంటున్నా. ‘థ్యాంక్యూ వెరీ మచ్‌. నేను ఇక మీదట టెస్టు క్రికెట్‌, ఐపీఎల్‌ మాత్రమే ఆడతాను. కుటుంబానికి సమయం కేటాయిస్తాను. అందరికీ గుడ్‌బై’ అంటూ అతడు చెప్పొచ్చేమో. అయితే.. విరాట్‌ గొప్ప ఫిట్‌నెస్‌ను కొనసాగిస్తాడు. మానసికంగా ఎంతో దృఢంగా ఉంటాడు. తగినంత విశ్రాంతి తీసుకుంటాడు. 

బరిలోకి నలుగురు ‘కీ’ ప్లేయర్లు.. అరుదైన ఘనతపై భారత్ కన్ను!

అతడికి ఆటపట్ల ఉండే అభిరుచి, పరుగుల దాహం, కసి ఇప్పటికీ అలానే ఉందని నేను నమ్ముతా. విరాట్ దృష్టి ఎప్పుడూ వ్యక్తిగత రికార్డులపై ఉండదు. అతడి ఉద్దేశం కూడా అది కాదు. తన జట్టు కోసం ప్రపంచకప్‌లు గెలవాలని కోరుకుంటాడు. అన్ని ఫార్మాట్‌లలో జట్టును విజయవంతంగా నిలబెట్టడంలో భాగమవుతాడు. అందుకే అతడు మైదానంలో ఉన్నప్పుడు అంతలా ఎమోషనల్‌గా కనిపిస్తాడు’’ అని ఏబీడీ తన యూట్యూబ్‌ ఛానల్‌లో విశ్లేషించాడు.

ఇక సచిన్‌ నెలకొల్పిన శత శతకాల రికార్డును బద్దలు కొట్టే ఏకైక ఆటగాడు విరాటే అని విశ్లేషకులు చెబుతారు. అయితే, దానికి ఇంకా 23 సెంచరీల దూరంలోఉన్నాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 77 శతకాలు ఉన్నాయి. అయితే, సచిన్‌ వన్డేల్లో కొట్టిన 49 సెంచరీలకు విరాట్ సమీపంలోనే ఉన్నాడు. విరాట్ 47 శతకాలతో కొనసాగుతున్నాడు. బుధవారం ఆసీస్‌తో మూడో వన్డేతోపాటు వరల్డ్ కప్‌లో తప్పకుండా ఆ రికార్డును కోహ్లీ అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు