ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ

ఇప్పుడంతా టీ20 లీగ్‌ల హవా కొనసాగుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20 (SA T20) లీగ్‌ జరుగుతోంది. ఈ క్రమంలో మిస్టర్ 360 ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB De Villiers) పలు కీలక విషయాలపై మాట్లాడాడు. ఏబీడీ ఐపీఎల్‌లోనూ (IPL) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడిన విషయం తెలిసిందే.

Published : 29 Jan 2023 01:19 IST

ఇంటర్నెట్ డెస్క్: ఏబీ డివిలియర్స్‌ కేవలం దక్షిణాఫ్రికా ఆటగాడిగానే కాకుండా.. ఐపీఎల్‌లోనూ అదరగొట్టేయడంతో భారత అభిమానులకూ సుపరిచితుడు. మైదానం నలువైపులా క్రికెటింగ్‌ షాట్లను కొట్టే ఏబీడీని అంతా ‘మిస్టర్ 360’గా పిలుస్తారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీడీ గతేడాది లీగ్‌లకూ గుడ్‌బై చెప్పేశాడు. ఈ క్రమంలో క్రికెట్ షెడ్యూలింగ్‌కు సంబంధించి డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లు రావడంతో ఆటగాళ్లు ఫార్మాట్లను ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. గతేడాది ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ వన్డేలకు వీడ్కోలు పలకడంపై ఎదురైన ప్రశ్నకు డివిలియర్స్ స్పందించాడు. 

‘‘మంచి ఫామ్‌లో ఉన్న బెన్‌స్టోక్స్ అలా వన్డే ఫార్మాట్‌ను వదిలేయడానికి కూడా క్రికెట్‌ షెడ్యూలింగ్‌ కారణం అయి ఉంటుంది. విపరీతమైన బిజీ షెడ్యూల్‌తో ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బంది పడతారు. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇదే సమస్య ఉంది. అయితే క్రికెటర్లను తమ జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడేలా స్ఫూర్తి నింపాల్సిన బాధ్యత ఆయా క్రికెట్‌ బోర్డులపై ఉంటుంది. అందుకే తొలుత ఆటగాళ్లతో మాట్లాడాలి. ఏం సాధించాలని అనుకుంటున్నారు..? వారు ఏ ఫార్మాట్‌కు సరిపోతారు..? అనే విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. మొదట దేశం కోసం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత లీగుల్లో ఆడటంపై ఏమాత్రం అభ్యంతరం ఉండదు. అయితే దీనికోసం బోర్డు, ఆటగాళ్లు పరస్పరం చర్చించుకోవాలి’’ 

‘‘విదేశాల్లో జరిగే లీగుల్లో ఆడితే వచ్చే అనుభవం మెగా టోర్నీల్లో సాయపడుతుంది. తనతోపాటు సూర్యకుమార్‌ యాదవ్, డేవాల్డ్‌ బ్రెవిస్‌ వంటి క్రికెటర్లు రాణించారు. అదంతా లీగ్‌లతోనే సాధ్యమైంది. అందుకే మనం ఏం చేయగలమనేదానిపై దృష్టిపెట్టాలి. సదరు ప్లేయర్ ఓ ఫార్మాట్‌లో ఆడేందుకు ఇబ్బంది పడుతుంటే స్ఫూర్తి నింపాలి. అలాగే  కొనసాగితే మాత్రం అతడితో చర్చించాల్సిన అవసరం ఉంది. నా కెరీర్‌లో నేను గమనించిన అంశమదే. తరచూ మాట్లాడుతూ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు కూడా ఈ విషయంలో  మద్దతుగా నిలిచింది’’ అని ఏబీ డివిలియర్స్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని