AB de Villiers: ఐపీఎల్‌.. నాతోపాటు ఎంతోమంది ఆటగాళ్ల జీవితాలను మార్చేసింది: డివిలియర్స్‌

ఐపీఎల్ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్) తనతో ఎంతో మంది జీవితాలను మార్చేసిందని దక్షిణాఫ్రికా, ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ అన్నాడు.

Published : 30 Dec 2022 21:16 IST

ఇంటర్నెట్ డెస్క్: ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers).. ఇండియా ఫ్యాన్స్‌ అభిమానించే అతి తక్కువమంది విదేశీ ఆటగాళ్లలో ఒకడు. ఈ మిస్టర్‌ 360 డిగ్రీల ఆటగాడు ఐపీఎల్‌ (IPL) లో ఎన్నో అద్భుతమైన విన్యాసాలు చేసి అభిమానుల మనసు దోచుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభమైన మొదట్లో కొన్ని సీజన్లు దిల్లీ తరఫున ఆడిన డివిలియర్స్‌.. 2011 నుంచి గతేడాది రిటైర్మెంట్ ప్రకటించే వరకు రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) తరఫున ఆడాడు. తాజాగా ఐపీఎల్‌ ప్రారంభ రోజుల్లో తన జ్ఞాపకాలను పంచుకున్నాడు.  ఈ లీగ్ తనతోపాటు ఎంతోమంది ఇతర క్రికెటర్ల జీవితాలను మార్చిందని పేర్కొన్నాడు. తన ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గ్లెన్ మెక్‌గ్రాత్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం అనేది జీవితంలో మర్చిపోలేని సంఘటన అని పేర్కొన్నాడు.   

‘ఇది (ఐపీఎల్‌ ప్రారంభం) నాతో పాటు ఎంతో మంది ఇతర ఆటగాళ్లకు గొప్ప సందర్భం. ఐపీఎల్‌ మా జీవితాలను మార్చింది. క్రికెట్‌పై ప్రజలు నిజంగా మక్కువ చూపుతున్నారు. స్వదేశీ జట్టుతోపాటు ఇతర జట్లలోని ప్లేయర్స్‌కి కూడా మద్దతు ఇస్తారు. నాకు ప్రత్యేకంగా కనిపించేది విషయం ఏంటంటే.. నేను కలుసుకున్న వ్యక్తులు. గ్లెన్‌ మెక్‌గ్రాత్‌తో కొంత సమయం గడిపాను. అప్పుడు అనుకోకుండా అతడి కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌లో బీర్‌ తాగా’ అని డివిలియర్స్‌ వెల్లడించాడు. 

ఏబీ డివిలియర్స్, మెక్‌గ్రాత్ ఇద్దరూ ఐపీఎల్‌ మొదటి రెండు సీజన్లలో దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడారు. ఐపీఎల్‌లో మొత్తం 184 మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్‌ 39.71 సగటు, 151.69 స్ట్రైక్‌రేట్‌తో 5,162 పరుగులు చేశాడు. ఆటగాడిగా రిటైర్మెంట్‌ ప్రకటించిన డివిలియర్స్‌ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 15 సీజన్‌లో ఆర్సీబీ కోచింగ్‌ బృందంలో చేరే అవకాశమున్నట్లు గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. అయితే, దీనిపై ఆర్సీబీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని