AB devilliers: డీకే కెరీర్‌ ముగింపు దశకు వచ్చిందనుకున్నా.. కానీ: ఏబీ డివిలియర్స్‌

కొద్దిరోజు క్రితం బెంగళూరు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ కెరీర్‌ ముగింపు దశకు చేరిందనుకున్నట్లు చెప్పాడు ఆ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌...

Published : 20 Apr 2022 09:29 IST

(Photo: Dinesh Karthik Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత సీజన్‌లో బెంగళూరు తరఫున అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతున్న దినేశ్‌ కార్తీక్‌.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ అతడిని కొనియాడుతున్నారు. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన ఆ జట్టు మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌.. కార్తీక్‌ ఆట తీరుపై స్పందించాడు.

‘కార్తీక్‌ నుంచి ఇలాంటి బ్యాటింగ్‌ ఊహించలేదు. తన ఆటతో నన్ను ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడు దంచికొట్టగల సత్తా ఉన్న ఆటగాడని నాకెప్పుడో తెలుసు. తీవ్ర ఒత్తిడి ఉన్న పరిస్థితుల్లోనూ అతడు రాణించాలనుకుంటాడు. అయితే.. తగినంత క్రికెట్‌ ఆడలేకపోయాడు. ఈ సీజన్‌కు ముందు చివరిసారి డీకేను చూసింది ఇంగ్లాండ్‌లో కామెంట్రీ చేసినప్పుడే. మరోవైపు దేశవాళీ క్రికెట్‌లోనూ ఎక్కువగా ఆడలేకపోతుండటంతో ఇక అతడి కెరీర్‌ ముగింపు దశకు వచ్చిందని అనుకున్నా. కానీ, ఇప్పుడు పరుగులు చేయాలన్న కసి, పట్టుదలతో మనందర్నీ ఆశ్చర్యపరిచాడు’ అని డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా, డివిలియర్స్‌ దశాబ్ద కాలం పాటు బెంగళూరు తరఫునే ఆడి ఈ సీజన్‌కు ముందు అన్ని ఫార్మాట్ల గేమ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో బెంగళూరు ఈసారి అతడి సేవలను కోల్పోయింది. ఈ క్రమంలోనే మెగా వేలంలో కోల్‌కతా మాజీ కెప్టెన్‌ కార్తీక్‌ను రూ.5.5 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఈసారి టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోవాలన్న కసితో ప్రస్తుత సీజన్‌లో రెచ్చిపోతున్నాడు. ఛేదనల్లో ఆ జట్టును విజయతీరాలకు చేరుస్తూనే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తే ఫినిషర్‌గా భారీ స్కోర్లు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అందరి ప్రశంసలూ పొందుతున్నాడు. మాజీ సారథి, టీమ్‌ఇండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ సైతం డీకేను ప్రశంసించాడు. అతడు రాబోయే ప్రపంచకప్‌లో ఫినిషర్‌ పాత్ర పోషించగలడని ధీమా వ్యక్తం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని