Virat -Babar: ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు
ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీది (Virat Kohli) ప్రత్యేక స్థానం. ఆటగాడిగా మైదానంలో దూకుడుగా ఉంటాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ.. ఇలా అత్యుత్తమం. ప్రస్తుతం విరాట్‌తో బాబర్‌ను ఎక్కువగా పోలుస్తూ కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో (Virat Kohli) పోల్చదగిన ఆటగాడిగా ఇటీవల కాలంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) పేరు వినిపిస్తోంది. మ్యాచ్‌లపరంగా విరాట్ కంటే బాబర్ చాలా తక్కువే ఆడాడు. విరాట్ కోహ్లీ సుదీర్ఘకాలం తన అత్యుత్తమ ఫామ్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఫామ్‌పరంగా కాస్త తగ్గినప్పటికీ ఫిట్‌నెస్‌లో మాత్రం విరాట్‌ను మించే ఆటగాడు లేడనేది కాదనలేని సత్యం. అయితే నిలకడైన ఆటతీరు, ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించడం వంటి అంశాల్లో విరాట్, బాబర్ సరిసమానులేనని కొందరు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తుంటారు. మరి, వీరిద్దరిలో ఎవరు అత్యుత్తమం..? అనే విషయంపై మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వెల్లడిస్తుంటారు. తాజాగా పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ స్పందించాడు. ఒక్క విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ దరికి కూడా బాబర్ చేరలేడని పేర్కొన్నాడు.
‘‘విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. జట్టును అద్భుతంగా నడిపించాడు. ఎప్పుడూ పాజిటివ్ దృక్పథంతో ఉంటాడు. నైపుణ్యాలను చక్కగా వినియోగించుకుంటాడు. విరాట్‌లో మరో అత్యుత్తమ విషయం ఫిట్‌నెస్. ప్రపంచస్థాయి ఫిట్‌నెస్ కలిగిన ఆటగాడు. ఇదే క్రమంలో విరాట్‌తో పోలిస్తే బాబర్ అజామ్ ఫిట్‌నెస్ చాలా పూర్‌గా ఉంటుంది. పాక్ నంబర్ వన్ ఆటగాడు బాబర్ అజామ్. అంతర్జాతీయంగా వన్డేల్లోనూ టాప్ ప్లేయర్. ఫార్మాట్ ఏదైనా నిలకడగా ఆడతాడు. విరాట్‌తో బాబర్‌ను పోల్చాల్సిన అవసరం లేదు. ఇదెలా ఉంటుందంటే.. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్‌లో ఎవరు బెటర్? అని అడిగినట్లు ఉంటుంది. కాబట్టి, విరాట్ కోహ్లీ భారత్ అత్యుత్తమ ఆటగాడు. బాబర్ పాక్‌కు చెందిన టాప్ ప్లేయర్. వీరిద్దరూ ప్రపంచస్థాయి ఆటగాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఫిట్‌నెస్ విషయంలోనే వీరి మధ్య కాస్త తేడా ఉంటుంది’’ అని అబ్దుల్ రజాక్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.