RR vs SRH: లాస్ట్‌ బాల్ థ్రిల్లర్‌.. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ రికార్డులివీ..

సన్‌రైజర్స్ (SRH) అదరగొట్టింది. రాజస్థాన్‌ను చివరి బంతికి చిత్తు చేసి విజయం సాధించింది. దీంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సజీవంగానే ఉంచుకోగలిగింది. మిగిలిన మ్యాచుల్లోనూ విజయం సాధించి.. ఇతర జట్ల ఫలితాలపై సన్‌రైజర్స్‌ ఛాన్స్‌లు ఆధారపడి ఉన్నాయి.

Updated : 08 May 2023 08:27 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో (IPL) సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చరిత్ర సృష్టించింది. జైపుర్‌ వేదికగా రాజస్థాన్‌పై 215 పరుగుల టార్గెట్‌ను (RR vs SRH) ఛేదించింది. చివర్లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (25: 7 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్), అబ్దుల్ సమద్‌ (17* 7 బంతుల్లో రెండు సిక్స్‌లు) దూకుడుగా ఆడి గెలిపించారు. అంతకుముందు అభిషేక్ శర్మ (55), రాహుల్ త్రిపాఠి (47) రాణించారు. రాజస్థాన్‌ బౌలర్ సందీప్‌ శర్మ చివరి బంతిని ‘నో బాల్‌’గా వేయడంతో విజయం హైదరాబాద్‌ సొంతమైంది. సమద్ అద్భుతమైన సిక్స్‌తో ముగింపు పలికాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ - రాజస్థాన్‌ మ్యాచ్‌ మధ్య పలు రికార్డులు నమోదయ్యాయి. 

మ్యాచ్‌ విశేషాలు..

2019లో రాజస్థాన్‌పైనే 199 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఛేదించి విజయం సాధించింది. ఇప్పుడు 215 రన్స్‌ను ఛేదించి గెలిచి రికార్డు సృష్టించింది. 

చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు సాధించి హైదరాబాద్‌ విజయం సాధించింది. ఇలా గెలిచిన మూడో జట్టుగా అవతరించింది. బెంగళూరుపై సీఎస్‌కే 43 పరుగులు (2012 సీజన్‌లో), గుజరాత్‌పై కోల్‌కతా 43 పరుగులను (2023 సీజన్‌లో) ఆఖరి రెండు ఓవర్లలో రాబట్టాయి. 

జైపుర్‌లో అత్యంత విజయవంతమైన ఛేజింగ్‌ ఇదే కావడం విశేషం. ఇంతకుముందు డెక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్‌ 2012 సీజన్‌లో 197 పరుగులు చేసి విజయం సాధించింది. 

ఐపీఎల్‌లోనూ ఐదో అత్యధిక పరుగుల ఛేదనగా ఈ మ్యాచ్‌ నిలిచింది. ఇప్పటి వరకు 2020 సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై షార్జా వేదికగా 224 పరుగులను ఛేదించి రాజస్థాన్‌ విజయం సాధించింది. 

ఐపీఎల్‌ చరిత్రలో 200కిపైగా పరుగుల ఛేదన చేయడం 21వ సారి. ఈ సీజన్‌లో మాత్రం ఆరోది కావడం విశేషం. అలాగే ఒకే మ్యాచ్‌లో 400+ పరుగులు నమోదు కావడం ప్రస్తుత సీజన్‌లో 12, మొత్తంగా 60వ సారి.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌కు ఆరో ఓటమి ఎదురైంది. తొలి ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో విజయం సాధించి ఒక మ్యాచ్‌లోనే ఓడిన రాజస్థాన్‌.. తర్వాతి ఆరింటిలో కేవలం ఒక్కటే గెలిచి ఐదు మ్యాచుల్లో ఓడింది. 

కనీసం 25 పరుగులు చేసిన మ్యాచ్‌లో అత్యుత్తమ స్ట్రైక్‌రేట్‌ కలిగిన రెండో బ్యాటర్‌గా గ్లెన్‌ ఫిలిప్స్‌ రికార్డు సృష్టించాడు. గతంలో గుజరాత్‌పై శశాంక్ సింగ్ (25*:6 బంతుల్లో) 416.66 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. ఇప్పుడు రాజస్థాన్‌పై ఫిలిప్స్‌ 357.14 స్ట్రైక్‌రేట్‌తో విజృంభించాడు.

జైపుర్‌లో 214/2 స్కోరే అత్యధికం కావడం విశేషం. ఇదే సీజన్‌లో చెన్నైపై రాజస్థాన్‌ 202/5 స్కోరు చేసింది. సెకండ్‌ వికెట్‌కు రాజస్థాన్‌ తరఫున అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన రెండో మ్యాచ్‌ కూడా ఇదే. జోస్ బట్లర్ - సంజూ శాంసన్ కలిసి 138 పరుగులను జోడించారు. గతంలో వీరిద్దరే ఎస్‌ఆర్‌హెచ్‌పైనే 2021 సీజన్‌లో ఏకంగా 150 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జోస్‌ బట్లర్‌ అదిరిపోయే ప్రదర్శన ఇస్తున్నాడు. గత నాలుగు మ్యాచుల్లో వరుసగా 124, 35, 54, 95 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ సెంచరీ చేసే అవకాశం (95) కాస్తలో చేజారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని