Abhishek Sharma: రెండో మ్యాచ్‌లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిదంటే?

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో అభిషేక్ తన సొంత బ్యాట్ వాడలేదు. 

Published : 08 Jul 2024 11:04 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2024 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున అదరగొట్టి జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma). ఈ 23 ఏళ్ల కుర్రాడు జింబాబ్వేతో తొలి టీ20లో డకౌట్‌ అయినప్పటికీ రెండో టీ20లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత నెమ్మదిగా ఆడిన అభిషేక్ తర్వాత సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్న భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రెండో టీ20లో భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడాడు. ఈ టూర్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శుభ్‌మన్‌ గిల్‌తో తనకున్న అనుబంధాన్ని అభిషేక్ గుర్తు చేసుకున్నాడు. అండర్‌-12 కేటగిరీ నుంచి ఇద్దరం కలిసి ఆడుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో గిల్‌ బ్యాట్‌తోనే ఆడినట్లు చెప్పాడు.  

‘‘మేమిద్దరం అండర్‌-12 నుంచి కలిసి ఆడుతున్నాం. నేను భారత జట్టుకు ఎంపికైనప్పుడు శుభ్‌మన్‌ గిల్‌ నుంచి నాకు ఫస్ట్ కాల్ వచ్చింది. ఈ మ్యాచ్‌లో నేను శుభ్‌మన్ గిల్‌ బ్యాట్‌తో ఆడా. ఆ బ్యాట్‌కు, శుభ్‌మన్‌ గిల్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెపుతున్నా. ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లు ఆడినపుడు నేను గిల్‌ బ్యాట్‌ను అడుగుతా. అండర్-12 రోజుల నుంచి ఇది కొనసాగుతోంది. ఐపీఎల్‌లో కూడా అతడి బ్యాట్ తీసుకుని ఆడా. నేను రాణించడానికి యువీ పాజీ (యువరాజ్‌ సింగ్) నాకు చాలా అండగా నిలుస్తాడు. నన్ను నేను సిక్సర్‌ కింగ్ లేదా మరోవిధంగా ఊహించుకోను. లాప్టెడ్ షాట్స్‌ ఆడటానికి అనుమతించిన మా నాన్నకు స్పెషల్ థాంక్స్‌. సాధారణంగా కోచ్‌లు యువ ఆటగాళ్లు లాప్టెడ్ షాట్లు ఆడటానికి అనుమతించరు. కానీ, మా నాన్న ఎల్లప్పుడూ ఒక విషయం చెప్పేవారు. నువ్వు లాప్టెడ్ షాట్ ఆడాలనుకుంటే తర్వాత ఆ  బంతి మైదానం బయట ఉండాలనేవారు. ఈ మ్యాచ్‌లో నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది. మొదటి కొన్ని బంతుల్లో నేను ఫోర్లు లేదా సిక్స్‌లు సాధించినప్పుడల్లా అది నా రోజు అని నమ్ముతాను’’ అని అభిషేక్ శర్మ పేర్కొన్నాడు. జింబాబ్వే, భారత్ మధ్య మూడో టీ20 బుధవారం (జులై 10న) జరగనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు