Novak Djokovic: వ్యాక్సిన్‌ పట్ల జకోవిచ్‌ మనసు మార్చుకుంటారని ఆశిస్తున్నా: పునావాలా

టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌కు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనవాల్లా వినూత్న అభ్యర్థన చేశాడు. కొవిడ్‌-19 వాక్సినేషన్‌ పట్ల జకోవిచ్‌కు ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తూనే...

Updated : 18 Feb 2022 10:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌కు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా వినూత్న అభ్యర్థన చేశాడు. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ పట్ల జకోవిచ్‌కు ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తూనే.. త్వరలో మనసు మార్చుకుంటాడని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. దీనికి పునావాలా తన సహచరుడితో కలిసి టెన్నిస్‌ ఆడుతున్న వీడియోను కూడా జత చేశారు. ‘వ్యాక్సిన్‌ తీసుకోవడం పట్ల మీకున్న వ్యక్తిగత అభిప్రాయాలను నేను గౌరవిస్తా. అలాగే మీరు టెన్నిస్‌ ఆడుతుంటే చూడటం కూడా నాకెంతో ఇష్టం. అయితే, మీరు మనసు మార్చుకొని త్వరలోనే వ్యాక్సిన్‌ తీసుకుంటారని ఆశిస్తున్నా. ఆ లోపు మేమంతా (టెన్నిస్‌ క్రీడాకారులు) మరో గ్రాండ్‌స్లామ్‌ కోసం ఎదురుచూస్తుంటాం’ అని పునావాలా ట్వీట్‌ చేశారు.

కాగా, జకోవిచ్‌ తీరు గతనెల ఆస్ట్రేలియా ఓపెన్ సమయంలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో తొలి టోర్నీ సాధించి కెరీర్‌లో రికార్డు స్థాయిలో 21 గ్రాండ్‌స్లామ్‌లతో చరిత్ర సృష్టించాలని అనుకున్న అతడు చివరికి టోర్నీలోనే పాల్గొనలేకపోయాడు. అతడు వ్యాక్సిన్‌ తీసుకోని కారణంగా మెల్‌బోర్న్‌లో బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్‌ వీసాను రద్దు చేసి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనలేకుండా చేశారు. ఈ నేపథ్యంలోనే అతడు మెల్‌బోర్న్‌ విడిచి వెళ్లాడు. ఇక తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఏదైనా టోర్నీలో పాల్గొనాలంటే కచ్చితంగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఆదేశిస్తే.. తాను ఆ టోర్నీలోనే పాల్గొననని స్పష్టం చేశాడు. అలాగే తాను ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోలేదని, కానీ.. దానికి తాను విరుద్ధం కాదని కూడా జకోవిచ్‌ పేర్కొన్నాడు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని