Australia Vs Afghanisthan: కూనలు కాదు అఫ్ఘనులు

అఫ్గానా.. మజాకా! అఫ్గానిస్థాన్‌ను చిన్న జట్టు అని ఇంకెవరైనా అంటారా? సంచలనాలను సృష్టించడం అలవాటుగా మార్చుకుని.. పెద్ద జట్లకు షాక్‌లిస్తున్న అఫ్ఘనులు మరో అద్భుత విజయాన్ని అందుకున్నారు.

Published : 24 Jun 2024 03:43 IST

ఆస్ట్రేలియాకు అఫ్గానిస్థాన్‌ షాక్‌ 
సూపర్‌-8 పోరులో అద్భుత విజయం

అఫ్గానా.. మజాకా! అఫ్గానిస్థాన్‌ను చిన్న జట్టు అని ఇంకెవరైనా అంటారా? సంచలనాలను సృష్టించడం అలవాటుగా మార్చుకుని.. పెద్ద జట్లకు షాక్‌లిస్తున్న అఫ్ఘనులు మరో అద్భుత విజయాన్ని అందుకున్నారు. టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో మాజీ ఛాంపియన్, మేటి జట్టు ఆస్ట్రేలియాపై చిరస్మరణీయమైన గెలుపును సొంతం చేసుకున్నారు. బ్యాటింగ్‌లో గుర్బాజ్, జద్రాన్‌ పోరాటానికి.. బౌలింగ్‌లో గుల్బాదిన్, నవీనుల్‌ మెరుపులు తోడవడంతో అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి ఆసీస్‌ను ఆ జట్టు ఓడించింది. నిరుడు వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై వీరోచిత డబుల్‌ సెంచరీతో ఆసీస్‌ను గెలిపించిన మ్యాక్స్‌వెల్‌.. ఈ మ్యాచ్‌లోనూ అడ్డుపడేలా కనిపించినా.. అఫ్ఘనులు అవకాశాన్ని వదల్లేదు. ఈ విజయంతో అఫ్గాన్‌ సెమీస్‌ రేసులోకి రాగా.. ఆసీస్‌ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి.

కింగ్స్‌టౌన్‌

అఫ్గానిస్థాన్‌ అదరహో. ఈ పొట్టికప్‌ గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన ఆ జట్టు.. ఇప్పుడు సూపర్‌-8లో బలమైన ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. ఆదివారం గ్రూప్‌-1 మ్యాచ్‌లో అఫ్గాన్‌ 21 పరుగుల తేడాతో గెలిచింది. మొదట రహ్మనుల్లా గుర్బాజ్‌ (60; 49 బంతుల్లో 4×4, 4×6), ఇబ్రహీం జద్రాన్‌ (51; 48 బంతుల్లో 6×4) రాణించడంతో అఫ్గాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. కమిన్స్‌ (3/28) వరుసగా రెండో హ్యాట్రిక్‌ అందుకున్నాడు. జంపా (2/28) కూడా మెరిశాడు. ఛేదనలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గుల్బాదిన్‌ నైబ్‌ (4/20) విజృంభణతో ఆసీస్‌ 19.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. నవీనుల్‌ హక్‌ (3/20) కూడా సత్తాచాటాడు. మ్యాక్స్‌వెల్‌ (59; 41 బంతుల్లో 6×4, 3×6) పోరాటం వృథా అయింది. 

పేసర్లు కూల్చారు: బలమైన బ్యాటింగ్‌ లైనప్, లోతు ఉన్న ఆసీస్‌కు ఛేదన పెద్ద కష్టమేమీ కాదనిపించింది. కానీ ఆ అంచనా తప్పని, తమ బౌలింగ్‌ భయపెడుతుందనేలా నవీనుల్‌ కొత్త బంతితో చెలరేగాడు. వరుస ఓవర్లలో హెడ్‌ (0), మార్ష్‌ (12)ను పెవిలియన్‌ చేర్చాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్‌ మూడో బంతికే హెడ్‌ను బౌల్డ్‌ చేసిన తీరు గురించి చెప్పుకోవాలి. లెగ్‌సైడ్‌ వెళ్లేలా కనిపించిన బంతి అనూహ్యంగా స్వింగ్‌ అయి స్టంప్స్‌ను లేపేయడంతో హెడ్‌ నమ్మశక్యం కానట్లు నిష్క్రమించాడు. వార్నర్‌ (3)ను నబి వెనక్కిపంపడంతో తొలి ఆరు ఓవర్లలో 32/3తో నిలిచిన ఆసీస్‌ ఈ ప్రపంచకప్‌లో అత్యల్ప పవర్‌ప్లే స్కోరు నమోదు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మ్యాక్స్‌వెల్‌ పోరాటం కొనసాగించాడు. అఫ్గాన్‌ అంటే చాలు చెలరేగిపోయే అతను మరోసారి బౌండరీల వేటలో సాగిపోయాడు. కానీ మధ్య ఓవర్లలో స్లో డెలివరీలు, షార్ట్‌పిచ్‌ బంతులు, కట్టర్లు.. ఇలా వైవిధ్యమైన బౌలింగ్‌తో గుల్బాదిన్‌ విజృంభించాడు. స్టాయినిస్‌ (11), టిమ్‌ డేవిడ్‌ (2)లను వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేర్చాడు. అయినా మ్యాక్సీ పోరాటంతో ఆసీస్‌ 14.3 ఓవర్లలో 106/5తో నిలిచింది. అప్పుటికీ ఆసీస్‌ గెలవాలంటే 33 బంతుల్లో 43 పరుగులు చేయాలి. జోరుమీదున్న మ్యాక్స్‌వెల్‌కు తోడు వేడ్‌ (5) క్రీజులో ఉన్నాడు. ఇంకా కమిన్స్‌ కూడా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. దీంతో ఆసీస్‌ పోటీలోనే ఉంది. కానీ ఆ జట్టు ఆశలను కూలుస్తూ.. గుల్బాదిన్‌ మొదట ప్రమాదకర మ్యాక్స్‌వెల్‌ను, ఆ తర్వాత కమిన్స్‌ (3)ను ఔట్‌ చేశాడు. మధ్యలో వేడ్‌ను రషీద్‌ ఖాన్‌ (1/23) పెవిలియన్‌ చేర్చడంతో ఆసీస్‌ పనైపోయింది. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. ఆ మిగిలిన వికెట్లనూ పడగొట్టిన అఫ్గాన్‌ గెలుపు సంతోషంలో తేలిపోయింది. 

ఆ జోడీ మళ్లీ..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌ పోరాడే స్కోరు చేయడానికి కారణం గుర్బాజ్, జద్రాన్‌. వీళ్లు తొలి వికెట్‌కు 118 పరుగులు జోడించారు. ఈ జోడీ నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించింది. కానీ తర్వాత చెలరేగింది. ఆసీస్‌ పేలవ ఫీల్డింగ్‌ కూడా వీళ్లకు కలిసొచ్చింది. స్పిన్నర్ల రాకతో స్కోరు వేగం తగ్గింది. 14వ ఓవర్లో జట్టు స్కోరు 100 దాటింది. ఆ వెంటనే గుర్బాజ్, జద్రాన్‌ అర్ధశతకాలు పూర్తిచేసుకున్నారు. కానీ గేరు మార్చాల్సిన దశలో వీళ్లు వెనుదిరిగారు. గుర్బాజ్‌ను స్టాయినిస్‌ ఔట్‌ చేయగా.. జంపా తర్వాతి ఓవర్లోనే ఒమర్‌జాయ్‌ (2), జద్రాన్‌ను పెవిలియన్‌ చేర్చాడు. చివర్లో కమిన్స్‌ హ్యాట్రిక్‌తో అఫ్గాన్‌కు దెబ్బపడింది. 18వ ఓవర్‌ చివరి బంతికి రషీద్‌ ఖాన్‌ (2)ను ఔట్‌ చేసిన అతను.. 20వ ఓవర్‌ తొలి రెండు బంతుల్లో వరుసగా కరీం (13), గుల్బాదిన్‌ (0)ను పెవిలియన్‌ చేర్చాడు. అతనికి ఇది వరుసగా రెండో హ్యాట్రిక్‌. బంగ్లాతో మ్యాచ్‌లోనే కమిన్స్‌ అంతర్జాతీయ కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్‌ అందుకున్న సంగతి తెలిసిందే. 

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) వార్నర్‌ (బి) స్టాయినిస్‌ 60; జద్రాన్‌ (సి) మార్ష్‌ (బి) జంపా 51; అజ్మతుల్లా (బి) జంపా 2; కరీం (సి) డేవిడ్‌ (బి) కమిన్స్‌ 13; రషీద్‌ (సి) డేవిడ్‌ (బి) కమిన్స్‌ 2; నబి నాటౌట్‌ 10; నైబ్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) కమిన్స్‌ 0; ఖరోట్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 148; వికెట్ల పతనం: 1-118, 2-121, 3-122, 4-126, 5-141, 6-141; బౌలింగ్‌: అగర్‌ 4-1-17-0; హేజిల్‌వుడ్‌ 4-0-39-0; కమిన్స్‌ 4-0-28-3; జంపా 4-0-28-2; మ్యాక్స్‌వెల్‌ 2-0-12-0; స్టాయినిస్‌ 2-0-19-1

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) నవీనుల్‌ 0; వార్నర్‌ (సి) నూర్‌ (బి) నబి 3; మార్ష్‌ (సి) నబి (బి) నవీనుల్‌ 12; మ్యాక్స్‌వెల్‌ (సి) నూర్‌ (బి) నైబ్‌ 59; స్టాయినిస్‌ (సి) గుర్బాజ్‌ (బి) నైబ్‌ 11; డేవిడ్‌ ఎల్బీ (బి) నైబ్‌ 2; వేడ్‌ (సి) కరీం (బి) రషీద్‌ 5; కమిన్స్‌ (బి) నైబ్‌ 3; అగర్‌ (సి) నైబ్‌ (బి) నవీనుల్‌ 2; జంపా (సి) నబి (బి) అజ్మతుల్లా 9; హేజిల్‌వుడ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం: (19.2 ఓవర్లలో ఆలౌట్‌) 127; వికెట్ల పతనం: 1-0, 2-16, 3-32, 4-71, 5-85, 6-106, 7-108, 8-111, 9-113; బౌలింగ్‌: నవీనుల్‌ 4-0-20-3; ఫారూఖీ 3-0-21-0; అజ్మతుల్లా 1.2-0-10-1; నబి 1-0-1-1; ఖరోట్‌ 1-0-13-0; రషీద్‌ 4-0-23-1; నూర్‌ 1-0-11-0; నైబ్‌ 4-0-20-4

 

 

 

ః టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ హాట్రిక్‌లు నమోదు చేసిన తొలి బౌలర్‌గా కమిన్స్‌ రికార్డు సృష్టించాడు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని