T20 World Cup: స్కాట్లాండ్‌పై అఫ్గాన్ ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా జరుగుతున్న మ్యాచులో అఫ్గానిస్థాన్‌ అదరగొట్టింది. స్కాట్లాండ్‌పై 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 10.2

Updated : 25 Oct 2021 22:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ అదరగొట్టింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. స్కాట్లాండ్‌పై 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 10.2 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. స్కాట్లాండ్‌ బ్యాటర్లలో జార్జ్ మున్సీ (25) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా విఫల కావడంతో స్కాట్లాండ్ ఘోర పరాజయం పాలైంది. భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన స్కాట్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముజీబుర్‌ రహ్మాన్‌ వేసిన నాలుగో ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్ పతనాన్ని శాసించాడు. ఆఖర్లో రషీద్‌ ఖాన్‌ కూడా విజృంభించడంతో స్కాట్లాండ్‌ స్వల్ప పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ కైల్‌ కోట్జర్‌ (10), క్రిస్‌ గ్రీవ్స్ (12) పరుగులు చేశారు. కలమ్ మెక్‌లాయిడ్‌ (0), రిచీ బెర్రింగ్టన్‌ (0), మాథ్యూ క్రాస్ (0), మైఖేల్ లియాస్క్‌ (0), మార్క్‌ (1), జోష్‌ డేవీ (4), షరీఫ్‌ (3), బ్రాడ్లే వీల్‌ (0) ఘోరంగా విఫలమయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ముజీబుర్ రహ్మాన్‌ ఐదు, రషీద్‌ ఖాన్‌ నాలుగు, నవీన్‌-ఉల్-హక్‌ ఒక వికెట్ తీశారు.  

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ నజీబుల్లా జద్రాన్ (59) అర్ధ శతకంతో రాణించడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఓపెనర్లు హజ్రాతుల్లా జజాయి (44), మహమ్మద్‌ షెహజాద్ (22) జట్టుకు శుభారంభం అందించారు. వేగంగా ఆడే క్రమంలో షెహజాద్ షరీఫ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహ్మానుల్లా (46)తో కలిసి మరో ఓపెనర్‌ హజ్రాతుల్లా ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే మార్క్‌ వాట్ వేసిన పదో ఓవర్లో హజ్రాతుల్లా బౌల్డయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన నజీబుల్లా జద్రాన్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌ నిలకడగా ఆడుతూ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. 19 ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రహ్మానుల్లా క్యాచ్‌ ఔటై క్రీజు వీడాడు. షరీఫ్‌ వేసిన ఆఖరి ఓవర్‌ చివరి బంతికి నజీబుల్లా జద్రాన్ ఔటయ్యాడు. ఆఖర్లో వచ్చిన కెప్టెన్‌ మహమ్మద్‌ నబీ (11) నాటౌట్‌గా నిలిచాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో షరీఫ్‌ రెండు, మార్క్ వాట్‌, జోష్‌ డేవీ తలో వికెట్ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని